రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి 14 మందితో కూడిన టీంను ఏర్పాటు చేశారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ ఉండనున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, శర్వానంద్ సోనోవాల్, అర్జున్ మేఘ్ వాల్, భారతీ పవార్, తరుణ్ చుగ్, డీకే అరుణ, రితురాజ్ సిన్హా, వానాటి శ్రీనివాసన్, సంబిత్ పాత్ర, రాజ్ దీప్ రాయ్ తోె పాటు సీటీ రవి, వినోద్ తావ్డే వీరిద్దరు కోకన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిని వచ్చే వారం నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ప్రతిపక్షాలు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని దింపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల మీటింగ్ జరిగింది. తాజాగా జీ7 దేశాల సదస్సు కోసం ప్రధాని మోదీ జర్మనీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటన ముగించుకుని వచ్చే లోపు వచ్చే వారం బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లకు చివరి తేదీ జూన్ 29 కావడంతో ఈలోపు రాష్ట్రపతి అభ్యర్థిని డిక్లెర్ చేయనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 15న కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 18న ఎన్నికలు జరుగనున్నాయి. జూలై 21న కొత్త రాష్ట్రపతి ఎవరో తెలియనుంది. వచ్చే నెల 24తో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏర్పడిన బీజేపీ ఎన్నికల టీం దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కూడగట్టనున్నాయి.
ఎన్డీయే అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు మంత్రులు, పార్టీ అధికారులతో కూడిన బీజేపీ కమిటీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. ఎన్డీయే తన రాష్ట్రపతి అభ్యర్థిని స్వయంగా గెలిపించుకునే ఓట్లు లేవు. అయితే బిజూ జనతాదళ్, వైసీపీ, టీడీపీ మద్దతు పొందే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రతిపక్షాల మీటింగ్ కు టీఆర్ఎస్, ఆప్ తన పార్టీ తరుపున ఎవరిని పంపించలేదు.