హైదరాబాద్ నగరంలో రోడ్లపై నానాటికీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐటీ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలులో ఉన్నా రోడ్లపై ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భారీ మార్పులు చేయాలని నిర్ణయించారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించనున్నారు. రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టేందుకు యోచిస్తున్నారు.
Read Also: స్వల్పంగా పెరిగిన హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు
నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లంగర్‌హౌజ్, నానల్ నగర్, రవీంద్రభారతి, కంట్రోల్ రూమ్‌తో పాటు పలు జంక్షన్లలో మార్పులు చేయనున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలన్నింటినీ నేరుగా పంజాగుట్ట వైపు అనుమతి ఇవ్వనున్నారు. ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఫ్రీలెఫ్ట్ విధానం విజయవంతమైన నేపథ్యంలో పలు ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. భారీ సంఖ్యలోవాహనాలు జంక్షన్‌ల వద్ద నిలిచిపోకుండా అధికారులు ప్రణాళికలు రూపొందించనున్నారు. జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో రద్దీగా ఉండే జంక్షన్‌ల వద్ద మార్పులు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా వారంరోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.