వడ్ల కొనుగోలు వ్యవహారం మాటలయుద్ధానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా, హైదరాబాద్ లో బీజేపీ దీక్షలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ చేతనైతే వడ్లు కొను…. లేదంటే గద్దె దిగు. ఢిల్లీలో కాదు… గల్లీలో తేల్చుకుందాం అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇందిరాపార్క్ వేదికగా జరిగిన బీజేపీ దీక్షలో బండి సంజయ్ సవాళ్ళు విసిరారు.
వడ్ల దందాతో కోట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్ర. బరాబర్ కొనేది కేంద్రమే… సేకరించి ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా? వడ్లు కొనేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు కేసీఆర్ చేసి… కేంద్రాన్ని బదనాం చేస్తే ఊరుకునేది లేదన్నారు బండి సంజయ్. ఓట్లు, సీట్లు కొంటవ్… రైతుల కోసం వడ్లు కొనలేవా? దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఇప్పుడే ఎందుకొచ్చింది? పంట చేతికొస్తున్న సమయంలో రైతులను అరిగోస పెడతావా? అన్నారు.
రైతులు చేసిన తప్పేంది?…. నువ్వు చేసిన తప్పులకు వాళ్లనెందుకు బలి చేస్తున్నవ్? మోదీని గద్దె దించే దమ్ముందా కేసీఆర్… రైతును రాజు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్రమోదీ. ఒక్కో ఎకరానికి 65 వేలకుపైగా ఖర్చు చేస్తున్న ఘనత మోదీ సర్కార్ దే. మోదీ పాలనలోనే పత్తి, మిర్చిసహా పంట ఉత్పత్తులకు అధికంగా గిట్టుబాటు ధర లభిస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ను ఫాంహౌజ్ నుండి ఢిల్లీకి గుంజుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు సింహాలై గర్జిస్తున్నరు. వడ్ల కొనుగోలు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో దీక్షల పేరిట డ్రామాలు చేస్తున్నారు. మోదీని గద్దె దించేంతటి మొనగాడివా? నీ పని ఎప్పుడో ఖతమైంది. తెలంగాణ ప్రజలు నిన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో దీక్ష కోసం 5 రోజులు కష్టపడి ఫ్లెక్సీలు, కట్టి కష్టపడితే కండ్లు మూసుకుని తెరిచే సరికి కేసీఆర్ దీక్ష ముగించిండు. కేసీఆర్ కు కాయిల్ తప్పింది. కొడుకు సీఎం పదవి కోసం డాడీ డాడీ అంటుండు… తండ్రి ప్యాడీ ప్యాడీ అని తిరుగుతుండు.
బీజేపీని కుక్కలంటున్నరు. మొరుగుతున్నవి టీఆర్ఎస్ కుక్కలే. మోదీ సింహం లెక్క గర్జిస్తున్నరు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంచి ప్రజలపై భారం వేసిండు. ఛార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. కాబట్టే చర్చను దారి మళ్లించేందుకే ఈ డ్రామాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉన్నాడన్నారు. కోట్లు పెట్టి సీట్లు, ఓట్లు కొంటున్నడు. కానీ రైతుల వడ్లు ఎందుకు కొనడం లేదు? కమీషన్లకు అలవాటు పడి బ్రోకర్ల చేతిలో పెడుతున్నడు. బియ్యం కొనేది మేమే… పైసలు చెల్లించేది కేంద్రమే. ఇన్నాళ్లు నేనే కొంటున్నా, కేంద్రానికి సంబంధం లేదని 7 ఏళ్లుగా ప్రజలను వంచించినవ్ కదా… మరెందుకు కొనడం లేదో చెప్పాలి?
నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి బీజేపీ వాస్తవాలు చెబితే రైతులు నమ్ముతున్నరని భయపడి ఉద్దేశంతో కేంద్రాన్ని బద్నాం చేసేందుకు రైతులను అరిగొస పెడుతున్నడు. మళ్లీ చెబుతున్నం… పక్కా కొనేది కేంద్రమే. నువ్వు సేకరించి ఇస్తవా లేదా? నువ్వు బ్రోకర్ వి మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకర్ గా మారి కమీషన్లు తీసుకుని వడ్లు సేకరించి కేంద్రానికి ఇవ్వాలి. డబ్బులు ఇచ్చేది కేంద్రమే. అన్ని రాష్ట్రాలతో కేంద్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని రాష్ట్రాలు యాసంగి పంట ధాన్యం వివరాలు వెల్లడిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ వివరాలు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ధాన్యం ఇవ్వబోమని, కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నామని రైతులను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్.
కేసీఆర్… రైతులు పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొని తీరాల్సిందే. కొనివ్వకుంటే నిన్ను ఉరికిస్తం. నువ్వు కోనేదాకా వదిలిపెట్టం. ధర్నాలు, దీక్షలన్నీ ఆడోళ్ల చీరలు గుంజడానికి, మైకులు లాక్కోవడానికి తప్ప నువ్వు సాధించేదేమీ లేదని సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. టీఆర్ఎస్ నేతలు సంస్కారహీనులు అంటూ మండిపడ్డారు బండి సంజయ్.