ఏపీలో పీఆర్సీ అంశం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని.. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also: మీరు లేకపోతే నేను లేను: ఉద్యోగులతో సీఎం జగన్
మరి ఏ విధంగా ఉద్యోగ సంఘాలు తృప్తి చెందాయో తెలియడం లేదని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక్క పిలుపుతో లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యోగుల త్యాగాన్ని బలాన్ని స్టీరింగ్ కమిటీ వృథా చేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయలేక పోయారన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గిందని.. రూ.11,500 కోట్ల భారం అంటూ సాకులు చెప్తున్న ఏపీ ప్రభుత్వంతో పోరాడటంలో స్టీరింగ్ కమిటీ వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. మొత్తానికి స్టీరింగ్ కమిటీ నాయకులు ఉద్యమానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ ప్రలోభాలకు వాళ్లు లొంగిపోయారని.. తాము మాత్రం ఆందోళనలు కొనసాగిస్తామని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. తమతో కలిసి వచ్చే సంఘాలతో నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.