ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది.
రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని మొత్తం 153 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కింది. తీవ్ర వడగాడ్పులు కొనసాగుతున్నాయి. వర్షాలకు అనుకూల వాతావరణం కనిపించడం లేదు. దీంతో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. అందువల్లే ఎండలు, వడగాడ్పులు అని వాతావరణ నిపుణులు విశ్లేషించారు.