ఆంధ్రప్రదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టేందుకు, మిడిల్ క్లాస్‌కు స్వయంగా లేఅవుట్లను వేయనుంది.. రాష్ట్రవ్యాప్తంగా మధ్య ఆదాయ వర్గాల కోసం నిర్దేశించిన ఎంఐజీ లే అవుట్లను వేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించని భూముల్ని అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లకు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూముల్ని పురపాలక శాఖకు తిరిగి అప్పగించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.
మధ్యాదాయ వర్గాల కోసం జగనన్న స్మార్ట్ టౌన్ల నిర్మాణం కోసం నిరుపయోగంగా ఉన్న భూముల్లో లే అవుట్లను వేయాల్సిందిగా పురపాలక శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. తక్కువ ధరల్లో మధ్యాదాయ వర్గాలకు ఈ లే అవుట్లలో ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు అవకాశముంటుందని స్పష్టం చేసింది.. గతంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు, కార్పోరేషన్లకు అప్పగించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములను పురపాలక శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు.. దేవాదాయ, విద్యాశాఖ, వక్ఫ్ సహా ఇతర ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు, అటవీశాఖ భూములు, నదీ తీర ప్రాంతాలు, జలవనరులు, కొండ ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టవద్దని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ అయ్యాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి.