కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. హెచ్ఆర్ఏలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు షాకిస్తూ… ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20 శాతం, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇస్తున్నారు. కొత్త విధానంలో 50 లక్షల జనాభాకు మించి ఉన్న నగరాల్లో 24 శాతం, 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే 16 శాతం, 5 లక్షల వరకు జనాభా ఉండే ప్రాంతాల్లో 8 శాతం హెచ్‌ఆర్ఏను ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే ఏపీలో 50 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం ఒక్కటీ లేకపోవడం గమనార్హం.
Read Also: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో మద్యం షాపుల పనివేళలు పొడిగింపు
అటు 2019 జూలై నుంచి 27 శాతం చెల్లించిన మధ్యంతర భృతి విషయంలోనూ నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి ఫిట్‌మెంట్ 23 శాతాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. దీనివల్ల అదనంగా ఇచ్చిన 4 శాతం విలువకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఐదు డీఏలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం… 18 నెలల బకాయిలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ బకాయిల నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్‌లను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు చేయనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే కొత్త పీఆర్సీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.