ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఏపీ వార్షిక బడ్జెట్ 2022కు ఆమోదం తెలిపేందుకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. అయితే తమకు ఇదే చివరి కేబినెట్ సమావేశమా? అని కొందరు మంత్రులు అడగ్గా.. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని జగన్ స్పష్టం చేశారు. పార్టీని గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావొచ్చని ఆయన సూచించారు.
ప్రాంతం, కులాల ఆధారంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. చాలామంది ఆశావాహులు ఉన్నారని… కేబినెట్‌లో లేనంత మాత్రాన డిమోషన్లుగా భావించొద్దని సీఎం జగన్ సూచించారు. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని అలాగే కొనసాగిస్తామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో ప్రస్తుత మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరుంటారు? ఎవరిని తప్పిస్తారు? అనే ఆందోళన మొదలైంది. మరోవైపు మంత్రి కావాలనే ఆశతో ఉన్న ఆశావహుల్లో ఈ సారైనా అవకాశం దక్కుతుందేమో అనే ఆశాభావం మొదలైంది.