అగ్నిపథ్ స్కీంకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నుంచి ఆందోళనకారులు బయటకు వెళ్లకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌కు రావాల్సిన కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిరసనకారులను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని, రైల్వే ఆస్తులకు ఎంతమేర నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలపై మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వస్తుందని వెల్లడించారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జీఆర్పీ పోలీసులతో పాటు కాచిగూడ నుంచి అదనపు బలగాలు, సివిల్ పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గి స్టేషన్‌ను వదిలి వెళ్లకపోతే కాల్పులు జరపాల్సి వస్తుందని రైల్వే పోలీసులు హెచ్చరించారు. అటు రైల్వే స్టేషన్ లోపలే కాకుండా బయట కూడా ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. 20 బైకులను తగలబెట్టడంతో పాటు ఓ బస్సును ధ్వంసం చేశారు.