దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రద్దయిన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి. మేడ్చల్-సికింద్రాబాద్, తిరుపతి-కాట్పాడి, డోన్-గుత్తి, డోన్-కర్నూల్ సిటీ, రేపల్లె-తెనాలి, సికింద్రాబాద్-ఉందానగర్ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.