రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులతో రష్యా బలగాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ శవాల గుట్టలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,500 మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. రష్యా దాడులు ప్రారంభించిన మొదటి 12 రోజుల్లో 1500 మంది చనిపోగా.. ప్రస్తుతం ఆ మరణాల సంఖ్య 2,500కి చేరిందన్నారు.
అటు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కైవసం చేసుకునే దిశగా రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం స్థానికంగా ఓ నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో దాదాపు ఇద్దరు మృతి చెందారని ఉక్రెయిన్ అత్యవసర సేవావిభాగం తెలిపింది. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. రష్యా దాడుల కారణంగా కీవ్ నగరంలోని అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్క్ మంటల్లో చిక్కుకుంది.