గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ. 19 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మంత్రులతో పాటు DGP మహేందర్ రెడ్డి, హైదరాబాద్ CP అంజనీ కుమార్ ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో ఈ రోజు మరోసారి సమీక్షించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లక్షలాది మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని.
విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాలలో 40 క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని… GHMC వ్యాప్తంగా 300 క్రేన్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించేలా 19 వేల మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ట్యాంక్ బండ్ పరిధిలో 2600 LED లైట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.