బెంబేలెత్తిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌…

మహమ్మారి పీడ వదిలింది అనుకునే లోపు కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. తాజా రూపాంతరం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ పేరు బీ. 1.1.1529. ఐతే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒమిక్రాన్‌ అని నామకరణం చేసింది. పాత వాటితో పోలిస్తే ఇది భయంకరమైంది మాత్రమే కాదు ప్రమాదకారి కూడా అన్నది శాస్త్రవేత్తల అంచనా.

నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒమిక్రాన్‌ గురించి దక్షిణాఫ్రికా రిపోర్ట్‌ చేసింది. నవంబర్ 9న సేకరించిన నమూనాలో దీనిని గుర్తించారు. ఈ లెక్కన చూస్తే దీని వ్యాప్తి ప్రారంభమై ఇప్పటికే ఇరవై రోజులు దాటింది. ఇప్పటికే చాలా మందికి సంక్రమించి ఉండవచ్చు. ప్రస్తుతం దీని వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ పలు దేశాలలో ఈ రకం కేసులు వెలుగు చూస్తున్నాయి. బోత్స్వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్​లో కూడా ఒమిక్రాన్‌ ఉనికి బయటపడింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి.

ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. వ్యాక్సీన్లకు లొంగుతుందో లేదో కూడా తెలియదు. ఈ అంశాలపై పరిశోధన జరుగుతోంది. దీనికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు. ఐతే కొత్త వేరియంట్‌ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి..కానీ స్పష్టమైన జవాబులు ఎవరి దగ్గరా లేవు. ప్రపంచ ఆరోగ్య సంసథ ప్రకటన వచ్చే వరకు వీటి ఊహాగానాలుగానే చూడాల్సి వుంటుంది.

ఒమిక్రాన్‌ అసాధారణ స్థాయిలో ఉత్పరివర్తనం చెందిందని, ఇప్పటివరకు కనిపించిన వేరియంట్ల కన్నా ఇది భిన్నమైనదని దక్షిణాఫ్రికా సైంటిస్టులు అంటున్నారు. వారి చెప్పిన దాని ప్రకారం, కరోనావైరస్ పరిణామ క్రమంలో ఇది చాలా స్థాయిలు దాటి ముందుకొచ్చింది. మొత్తంగా 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. శరీర కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. ఐతే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించడం ముఖ్యం.

ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిస్తుందన్న దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలోపలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తగా సరిహద్దులను మూసేస్తున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో పాటు దాని పొరుగు దేశాల నుంచి విమానాల రాకపోకలను బ్రిటన్, సింగపూర్, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, మొజాంబిక్ నిషేధించాయి. మరోవైపు, దక్షిణాఫ్రికా, బోత్స్‌వానా, నమీబియా, జింబాబ్వే, ఎస్వతిని , లెసొతొ నుంచి వచ్చే విమానాలను రద్దు చేయాలని యురోపియన్ యూనియన్ భావిస్తోంది. ఈ దేశాల్లో 12 గంటలకు పైగా గడిపిన వారిని చెక్ రిపబ్లిక్ తమ దేశంలోకి అనుమతించుట లేదు. శుక్రవారం రాత్రి వరకూ ఈ దేశాల్లోని తమ పౌరులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నట్టు జర్మనీ ప్రకటించింది. వీరంతా14 రోజులు తప్పనిసరి క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది.

మరోవైపు కొత్త వేరియంట్‌పై భారత్‌ అప్రమత్తమైంది. ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్‌ రిస్క్‌ దేశాల జాబితాను విడుదల చేసింది. యుకె, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌తో సహా యూరోపియన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పక్కాగా పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఐతే, ఇప్పటి వరకు భారత్‌లో కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

విదేశీ ప్రయాణికులు, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే వారికి వేగంగా పరీక్ష ప్రక్రియ నిర్వహించాలని భారత ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రారంభ దశలో ఉంది. కానీ ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్‌ని. సెకండ్ వేవ్‌లో సన్నద్ధత కొరవడటంతో భారీ మూల్యం చెల్లించింది. భయంకరంగా కేసులు పెరుగుదల సమాజాన్ని ,ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో అందరికంటే భారత్‌ ఎక్కువ అర్థం చేసుకోవాలి. కేవలం రెండు వారాలలోపే ఒమిక్రాన్‌ అన్ని వేరియంట్లను తలదన్నింది. అందుకే భారత్‌ దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇజ్రాయెల్‌లో నాలుగు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట దీనిని గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసులవ్యాక్సిన్ తీసుకుంది. ఐనా కొత్త వేరియెంట్ బారినపడింది. అలాగే కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఒమిక్రాన్ సోకుతోంది. దీనికి కారణం అది అధికంగా ఉత్పరివర్తనం చెందటమే. అందుకే ఇది డెల్టా కంటే ప్రమాదకారి కావచ్చని అంచనా. వేగంగా వ్యాపించటంతో పాటు తీవ్ర లక్షణాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.

దక్షిణాఫ్రికాలో ఇటీవలి వారాల్లో రోజుకు కేవలం 200 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఐతే, ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 25 వందలకు చేరింది. ఉన్నట్టుండి కేసులు పెరగటంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వైరస్ నమూనాలను అధ్యయనం చేసి కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు. అలా నవంబర్ 9న సేకరించిన నమూనా నుండి B.1.1.529 ఇన్‌ఫెక్షన్ మొదటిసారి నిర్ధారించబడిందని ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొత్త వేరియంట్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తెలిపింది.

దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు కేవలం 24శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నారు. దాంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చిని భావిస్తున్నారు. ఐతే, తొందరపడి ప్రయాణ ఆంక్షలు విధించొద్దని డబ్ల్యూహెచ్‌ఓ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఐనా, దక్షిణాఫ్రికా, బోత్స్వానా, నమీబియా, జింబాబ్వేల నుంచి విమాన సర్వీసులను బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్ నిలిపేశాయి. మరోవైపు, విమాన రాకపోకలపై బ్రిటన్‌ నిషేధం విధించడాన్ని దక్షిణాఫ్రికా విమర్శించింది. ఇది తొందరపాటు నిర్ణయమంది. డబ్ల్యూహెచ్‌ఓ తదుపరి చర్యలకు సిఫార్సు చేయకముందే దక్షిణాఫ్రికన్లు రాకుండా బ్రిటన్‌ తాత్కాలిక ట్రావెల్ బ్యాన్ విధించడం తొందరపాటు చర్యగానే అనిపిస్తోందని దక్షిణాఫ్రికా ఒక ప్రకటనలో పేర్కొంది.

ఒమిక్రాన్‌పై తమ వ్యాక్సిన్‌లు పనిచేస్తాయో లేదో ఖచ్చితంగా పనిచేస్తాయో లేదో తెలియదని ఫైజర్, బయోఎన్‌టెక్ తెలిపాయి. ఐతే వంద రోజులలో దీనికి కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించాయి.

డెల్టా కంటే ఒమిక్రాన్‌ ప్రమాదకరమైనదా? అంటే ఇప్పుడే చెప్పటం కష్టం. కానీ, ప్రస్తుతం డెల్టా ఆధిపత్యంలో ఉన్న దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నది శాస్త్రవేత్తల ముందున్న ప్రశ్న. అయితే ఆ వ్యాప్తికి అనేక కారణాలు ఉండవచ్చు. ఏదేమైనా, మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ కొత్త కరోనా ముందు ముందు ఏ స్థాయిలో విజృంభిస్తుందో తెలియదు. అందువల్లఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచింది. తప్పనిసరిగా పూర్తి స్థాయిలో టీకా తీసుకుని.. కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి. అదే అందరికి ..దేశానికి క్షేమం!!

-Dr. Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles