హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌..!

హుజురాబాద్‌ బరిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌ పట్టుకుందా? ఇన్నాళ్లూ తమ కేడర్‌ ఓటు పడితే చాలు.. పరువు దక్కుతుందని భావించిన పార్టీ వర్గాలు.. ఇప్పుడు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నాయి? ఓటు బ్యాంక్‌తో పార్టీ నేతలకు వచ్చిన తంటా ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

కాంగ్రెస్‌కు వచ్చిన సమస్యపై నేతల్లో చర్చ..!

హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార TRS.. బీజేపీ మధ్య ప్రచారం మొదలుకుని.. పాలిటిక్స్ వరకు పోటా పోటీగా నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీలు గెలుపుకోసం చేయని ప్రయత్నాలు లేవు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రభావితం చేసే నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. వారి అంతరంగం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సమస్య అంతా కాంగ్రెస్‌కే వచ్చి పడింది. ఆ సమస్యను తలుచుకునే పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట.

2018లో కాంగ్రెస్‌కు 62 వేల ఓట్లు వచ్చాయి..!

హుజురాబాద్‌లో గడిచిన ఎన్నికల్లో అభ్యర్థి బలాబలాల కంటే కాంగ్రెస్‌కు సగటున 35 నుంచి 40 వేల ఓటు బ్యాంక్‌ ఉంది. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో 62 వేల ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో ఎవరు ఉన్నా.. హస్తం గుర్తుకు ఢోకా ఉండేది కాదు. ఈ ఉపఎన్నిక మాత్రం ఆ ధీమా కల్పించలేకపోతోందట. కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ వేసిన తర్వాత ప్రచారంలోకి వెళ్లేకొద్దీ గ్రౌండ్‌లో పరిస్థితి చూసిన నాయకులకు ఫీజులు ఎగిరిపోతున్నాయట.

కాంగ్రెస్‌ కేడర్‌కు టీఆర్ఎస్‌, బీజేపీలు వల..!

క్షేత్రస్థాయిలో ఈక్వేషన్లు మారిపోతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. టీఆర్ఎస్‌, బీజేపీ శిబిరాలు రెండు.. కాంగ్రెస్‌ కేడర్‌పై గురిపెట్టాయి. ఈ ఒక్క ఉపఎన్నికతో కాంగ్రెస్‌కు వచ్చే లాభం.. నష్టం ఏమీ లేదు కదా అని ప్రశ్నిస్తూ.. తాయిలాల వల విసుతున్నాయట. ఈ ట్రాప్‌లో చాలా మంది పడినట్టు కాంగ్రెస్‌ నాయకులు అనుమానిస్తున్నారు. పోలింగ్‌ నాటికి మరికొందరు కూడా ఆకర్షణ వలకు చిక్కుతారని అనుకుంటున్నారట. సంప్రదాయ ఓటు బ్యాంకు ప్రలోభాలకు లొంగిపోతే.. ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.

కాంగ్రెస్‌ నాయకత్వం ఆలస్యంగా రంగంలోకి దిగిందా?

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వారం రోజులుగా కేడర్‌తో కలిసి ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం ఇక్కడే ఉంటే పార్టీ కేడర్‌కు కొంత నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కాకపోతే హుజురాబాద్‌ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వం ఆలస్యంగా రంగంలోకి దిగిందనే అభిప్రాయం ఉంది. ఈ ఆలస్యం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నారట. 2018లో కాంగ్రెస్‌కు పడిన 62 వేల ఓట్లు మళ్లీ రాలేకపోయినా.. టీఆర్ఎస్‌, బీజేపీ హోరాహోరీ పోరు మధ్య గౌరవ ప్రదమైన ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. మరి.. కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటో.. ఏ మేరకు ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటుందో నవంబర్‌ 2 వరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles