భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్ట్.. రికార్డులు బద్దలు..!

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ మ్యాచ్‌.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో… 23వేల పరుగులు చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌, టీమిండియా వాల్‌ రాహుల్ ద్రవిడ్‌… వన్డేలు, టెస్టుల్లో కలిపి 23వేల పరుగుల మార్క్‌ను దాటారు. తాజాగా ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ చేరాడు. 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. 34,357 పరుగులతో టెండూల్కర్‌ తొలిస్థానంలో ఉండగా… 24,208 రన్స్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక, విదేశాల్లో… ఒకే దేశంలో 10 అంతకంటే ఎక్కువ టెస్టులకు సారథ్యం వహించి తొలి ఇండియన్ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు కోహ్లీ… ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగానే ఈ రికార్డు కోహ్లీ సొంతమైంది. ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఇది పదో టెస్టు. ఆ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇంగ్లండ్‌లో 9 టెస్టులకు సారథ్యం వహించి రెండో స్థానంలో ఉండగా, సునీల్ గవాస్కర్ పాకిస్థాన్‌లో 8 టెస్టులకు సారథ్యం వహించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో నాలుగో స్థానం కూడా కోహ్లీదే. మరోవైపు.. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్థానం దిగజారింది. ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 773 రేటింగ్‌ పాయింట్లతో విరాట్‌ను వెనక్కినెట్టి ఆరు నుంచి ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. కోహ్లీ 5 నుంచి ఆరో ర్యాంక్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను అధిగమించి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అగ్రస్థానానికి చేరాడు. కేన్‌ రెండోస్థానానికి పడిపోయాడు. ఇక, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌… క్రికెట్‌పై తనుకున్న స్పిరిట్‌ను చాటుకున్నాడు. 40 ఓవర్‌ బౌలింగ్‌ చేస్తుండగా… అండర్సన్‌ గాయపడ్డాడు. రక్తం కారుతున్నా… ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. 165 టెస్టులాడిన అండర్సన్‌… 630 వికెట్లు పడగొట్టాడు.

Related Articles

Latest Articles

-Advertisement-