కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!

కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణ కోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది.

దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని అనుకుంటే పొరపాటే. కరోనా తర్వాత ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయి. పలురకాల వ్యాధులు వేధిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధిని డాక్టర్లు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో పేగుల్లో కుళ్లిపోయి.. గ్యాంగ్రీన్ ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకటా.. రెండా.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పితో కొందరు బాధితులు నిమ్స్‌లో చేరారు. పరీక్షలు చేసిన తర్వాత బాధితుల చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టిందని.. అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారిందని డాక్టర్లు గుర్తించారు. అంటే కరోనా బాధితుల పేగులు కుళ్లిపోయాయి. ఇద్దరు బాధితుల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పేగులను తొలగించారు. కిడ్నీలు కూడా పాడవడంతో డయాలిసిస్ చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. గ్యాంగ్రీన్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించారు.

తీవ్రమైన కడుపు నొప్పి, దానితో పాటు వాంతులు, నీళ్ల విరేచనాలు, నల్లరంగులో మలం, మూత్రంలో రక్తపు చారలు గ్యాంగ్రీన్ వ్యాధి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు. మొత్తానికి కరోనా వచ్చినా, వచ్చి తగ్గినా చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

-Advertisement-కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!

Related Articles

Latest Articles