హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు…!

కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. లోకల్‌పార్టీ నాయకులు సరికొత్త రాగం అందుకున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్‌ ఇస్తున్నారని తెలియడంతో.. లోకల్‌ మంత్రం జపిస్తున్నారట అక్కడి కాంగ్రెస్‌ నాయకులు. అదే పీసీసీ పెద్దలను చికాకు పెట్టిస్తోందట.

హుజురాబాద్‌ కాంగ్రెస్‌ నేతల కొత్త రాగం!

హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌, బీజేపీలకు భిన్నంగా వెళ్లాలన్నది కాంగ్రెస్‌ ఆలోచన. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడం మొదటి లక్ష్యమైతే.. బలమైన అభ్యర్థిని బరిలో దించితే పరువు కాపాడుకోవచ్చన్నది మరో ఆలోచన. అందుకే పీసీసీ స్థాయిలో అనేక వడపోతల తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ వైపు మొగ్గు చూపుతున్నారు నాయకులు. దీనిపై AICC నుంచి ప్రకటన రావడమే ఆలస్యమన్నది గాంధీభవన్‌ వర్గాల మాట. ఇంత వరకు బాగానే ఉన్నా.. అభ్యర్థి విషయంలో హుజురాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు వినిపిస్తున్న డిమండ్లే పార్టీ నేతలకు షాక్‌ ఇస్తున్నాయట.

పోటీకి సై అంటోన్న హుజురాబాద్‌ కాంగ్రెస్‌ నేతలు!

పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా.. హుజురాబాద్‌లో పోటీ చేసే ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని ఆ మధ్య పీసీసీ ప్రకటన చేసింది. అభ్యర్థి ఫలానా వ్యక్తి అని చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడంతో స్థానిక నాయకులు ఆశ్చర్యపోవడంతోపాటు.. పునరాలోచనలో పడ్డారట. పోటీ చేస్తామని భారీ సంఖ్యలోనే దరఖాస్తులు ఇచ్చారట. ఒకానొక సమయంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందా లేదా? బలమైన అభ్యర్థి బరిలో ఉంటారా లేరా అన్న చర్చ జరిగింది. అలాంటిది ఇప్పుడు లోకల్‌ లీడర్స్‌ ఉత్సాహం పార్టీ నేతలను ఆలోచనలో పడేసిందట. అయితే దరఖాస్తులు అందజేస్తున్న వారు పెడుతున్న షరతులే నాయకులను కలవర పెడుతున్నట్టు సమాచారం.

సురేఖకు కాకుండా లోకల్‌ నేతకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌!

అప్లికేషన్లతోపాటు పీసీసీ నిర్దేశించిన 5 వేల రూపాయల కాషన్‌ డిపాజిట్‌ కూడా పంపుతున్న హుజురాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు.. లోకల్‌ నాయకులకే టికెట్‌ ఇవ్వాలని స్వరం పెంచుతున్నారట. కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. సురేఖ పోటీ చేస్తే సహకరించబోమని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. అయితే సురేఖ పేరు వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కాకపోతే అభ్యర్థిని ఖారారుచేసే సమయంలో ఈ తలనొప్పులు ఏంటని చికాకు పడుతున్నారట పీసీసీ పెద్దలు.

Related Articles

Latest Articles

-Advertisement-