దర్శకుడిపై పోలీస్ కేసు పెట్టిన దక్షిణాది నటి!

పలు మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది నేహా సక్సేనా! మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ చిత్రాలతో పాటు హిందీలో సైఫ్ అలీఖాన్ ‘చెఫ్’లోనూ నేహా సక్సేనా ప్రధాన పాత్ర పోషించింది. కన్నడ సీరియల్ ‘హరహర మహాదేవ’లో మందాకినిగా నటించిన నేహా సక్సేనా ఇటీవల ఓ దర్శకుడిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. గత నెలలో ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు తనను శారీరకంగా గాయపరిచి, మానసికంగా హింసించాడంటూ నేహా సక్సేనా సెంట్రల్ బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ‘కసాబా’, ‘సఖవింతే ప్రియసఖీ’ ఫేమ్ నేహా సక్సేనా పదేళ్ళుగా చిత్రసీమలో నటిగా కొనసాగుతోంది. కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృతం, తుళు భాషల్లో దాదాపు 40 చిత్రాలలో నటించింది. ఇటీవల ఓ మలయాళీ ఫిల్మ్ మేకర్ తీస్తున్న తమిళ చిత్రంలో ఆమె నటించింది. ఆ సందర్భంగా తనను దర్శకుడు తీవ్రంగా హింసించాడని, అతని పై చర్చతీసుకోమని ఆమె పోలీస్ స్టేషన్ గడప తొక్కింది.

ఈ వ్యవహారం గురించి నేహా సక్సేనా సుదీర్ఘంగా వివరిస్తూ ఇలా చెప్పింది. ”కేరళకు చెందిన ఓ దర్శకుడు తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఓ తమిళ చిత్రం తీయాలనుకున్నాడు. అందులో ఓ ప్రముఖ పాత్ర పోషించమని నన్ను అప్రోచ్ అయ్యాడు. ప్రకాశ్ రాజ్ లేదా నాజర్ సరసన నేను నటించాల్సి ఉంటుందని చెప్పాడు. అందుకోసం అగ్రిమెంట్ చేసుకుని యాభై వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు. ఆగస్ట్ 20న షూటింగ్ లొకేషన్ కు వెళ్ళేసరికీ అక్కడ పరిస్థితి పరమ దారుణంగా ఉంది. రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఇక నా వల్ల కాదనిపించింది. వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి, షూటింగ్ వాతావరణం ఏదీ బాగాలేదు. దాంతో అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానని అన్నాను. నేను ఆ సినిమా నుండి వెళ్ళిపోతే, ఇతర నటీనటుల మీద ఆ ప్రభావం పడుతుందని దర్శకుడు రిక్వెస్ట్ చేశాడు. అందువల్ల మనసు మార్చుకుని సినిమాలో నటించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత కూడా రోజు రోజుకూ నా పరిస్థితి దారుణంగా తయారైంది. మేం ఉండే హోటల్ ఓనర్ సైతం నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. నా వ్యక్తిగత సిబ్బందిపై దాడికి దిగాడు. అక్కడ నుండి బయటపడలేని పరిస్థితి ఎదురైంది. దర్శకుడికి ఈ విషయమై మరో సారి ఫిర్యాదు చేస్తే, చిత్ర నిర్మాతకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు వెనక్కి వెళితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టాడు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో పంటిబిగువన సెప్టెంబర్ 19 వరకూ షూటింగ్ చేశాను. అందులో నాకు అసౌకర్యం కలిగించే సన్నివేశాలు చేయనని అడ్డం తిరిగాను. ఆ కారణంగా షూటింగ్ చివరి రోజున షూటింగ్ లో భాగంగా దర్శకుడు తన కొడుకుతో నన్ను మెట్లపై నుండి తోసేశాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన నిర్మాత ఇదంతా చూసి, నన్ను వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

ఆయనతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏమంటే, నిర్మాతను ఓ గూండాలా చిత్రీకరించి దర్శకుడు తన పబ్బం గడుపుకోవాలని చూశాడు. నిర్మాత మెతకదనాన్ని ఆసరాగా తీసుకుని, నన్ను, నా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశాడు. అందుకే నేను బెంగళూరు రాగానే… ఇక్కడ పోలీసులకు ఆ దర్శకుడి విషయమై ఫిర్యాదు చేశాను. ఓ ఫ్రెండ్ సాయంతో కమీషనర్, డీసీపీ, ఏసీపీలను కలిశాను. తొలుత ఆ చిత్ర సిబ్బంది తమ తప్పులేదని బుకాయించినా, నా దగ్గర అన్ని ఆధారాలు ఉండటంతో చివరకు దిగి వచ్చారు. పోలీసులు నాకు రావాల్సిన పారితోషికంతో పాటు దర్శక నిర్మాతల నుండి క్షమాపణ పత్రం కూడా ఇప్పించారు” అని తెలిపింది. ఇన్నేళ్ళు చిత్రసీమలో ఉన్న తనకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే, కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే వారి పరిస్థితి ఏమిటీ? అన్నది నేహా సక్సేనా వేస్తున్న ప్రశ్న!

-Advertisement-దర్శకుడిపై పోలీస్ కేసు పెట్టిన దక్షిణాది నటి!

Related Articles

Latest Articles