బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ల ఆధారంగా ఆయన త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజకీయరంగ ప్రవేశం చేస్తే గంగూలీ ఖచ్చితంగా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ అంశంపై గతనెలలో రెండు సార్లు గంగూలీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మే 8న గంగూలీ ఇంట్లో అమిత్ షా విందుకు హాజరయ్యారు. అటు మే 29న జరిగిన ఐపీఎల్ ఫైనల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ రెండు సార్లు గంగూలీతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ తన పొలిటికల్ ఎంట్రీ గురించి సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో మమతా బెనర్జీకి ధీటుగా గంగూలీని రంగంలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది.
ఇంతకీ గంగూలీ ఏమని ట్వీట్లు చేశారు?
2022 సంవత్సరంతో నా క్రికెట్ కెరీర్‌లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో క్రికెట్‌లో నా ప్రయాణం ప్రారంభమైంది. ఈ 30 ఏళ్లలో నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది.. నేను క్రికెట్‌కు ఎంతో సేవ చేశా. ముఖ్యంగా క్రికెట్‌ను ప్రేమించిన ప్రతీ వ్యక్తి నాకు మద్దతు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. ఇంతకాలం నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్లానింగ్ చేయాలనుకుంటున్నా. ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నాకు ఎప్పటిలాగే మద్దతు ఉంటుందని అనుకుంటున్నా అంటూ గంగూలీ రాసుకొచ్చాడు.