NTV Telugu Site icon

US Report: అమెరికా మానవహక్కుల నివేదికపై భారత్ ఆగ్రహం..

Usa India

Usa India

US Report: దేశంలో మానవహక్కుల పరిస్థితులపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది మణిపూర్ హింస చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో గణనీయమైన మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఇది తీవ్ర పక్షపాతంతో కూడుకున్నదని, భారత్‌పై సరైన అవగాహన లేదనే విషయాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గురువారం విదేశాంగ మంత్రిత్వశాఖ వారపత్రిక మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు.. అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, “ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది మరియు భారతదేశంపై చాలా తక్కువ అవగాహనను ప్రతిబింబిస్తుంది. మేము దీనికి ఎటువంటి విలువ ఇవ్వము మరియు మీరు కూడా అలాగే పరిగణించండి” అని ఆయన అన్నారు.

ఇటీవల విడుదలైన ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్: ఇండియా’ నివేదికలో అమెరికా ఈ ఆరోపణల్ని చేసింది. మణిపూర్‌లోని మెయిటీ, కుకీ కమ్యూటీల మధ్య జాతి వివాదం ‘‘మానవహక్కుల ఉల్లంఘనకు’ దారి తీసిందని పేర్కొంది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోడీ సిగ్గుచేటని అభివర్ణించి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది.

Read Also: Mumbai: కారులో ఆడుకుంటుండగా లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

ఇదే కాకుండా ఈ నివేదికలో జమ్మూ కాశ్మీర్‌లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారించారనే పలు రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గతంలో పలుమార్లు దేశంలో మానవహక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని అమెరికా రిపోర్టులు ఇచ్చింది. ప్రతీసారి కూడా భారత్ దీనిని తీవ్రంగా తప్పుబడుతూనే ఉంది.

గతేడాది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. మెజారిటీ మైయిటీ, కుకీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని మైయిటీ వర్గం కోరడాన్ని కుకీలు వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో పలువురు మరణించారు. చాలా మంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలివేరే ప్రాంతాలకు వెళ్లారు. అయితే, ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.