ప్రపంచ దేశాలు గత 2 సంవత్సరాలుగా కరోనా మహామ్మారితో పోరాడుతూనే ఉన్నాయి. కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలు ఎత్తి ప్రజలపై విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం డెల్టా వేరియంట్‌ను తట్టుకోలేక విలవిలలాడిపోయాయి. అయితే ఇప్పుడు గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. అంతేకాకండా ఆయా దేశాల ప్రజలపై దాని ప్రభావాన్ని చూపుడంతో భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటడంతో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యూకేలో ఒక్కరోజే 10 వేల ఒమిక్రాన్ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. అంతేకాకుండా యూకేలోనే ఒమిక్రాన్ మరణాలు సంభవించడం ఆ దేశ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం యూకేలో 37,101 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 15,452, నార్వేలో 2,060, భారత్‌లో 152 తో పాటు ఒమిక్రాన్ పుట్టిన దేశమైన సౌతాఫ్రికాలో 1,247 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలు దేశాలు హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించాయి.