దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం కలిగిస్తోంది.ఢిల్లీలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఢిల్లీ వాసుల్ని కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
దేశంలో 4,033 చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
కొవిడ్-19 వ్యాప్తితో ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా పోలీస్ సిబ్బందికి పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. పోలీస్ సిబ్బంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో భాగం కాబట్టి వైరస్ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు అందుబాటులో వుంచుకోవాలన్నారు. పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధనల్లో సూచించారు. ఢిల్లీలో 80వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
పోలీసులతో పాటు జైళ్ళలోని సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలోని మూడు జైళ్లలో నలభై ఆరు మంది ఖైదీలు, 43 మంది సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. తీహార్‌లో 29 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మిగిలిన 17 మంది మండోలి జైలులో ఉన్నారు.కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరుగుతున్నందున దేశ రాజధానిలో తదుపరి ఆంక్షలపై చర్చించడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ భేటీ అవుతోంది. కరోనా పెరిగినా అదుపులోనే వుందని నిన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అవసరం లేదన్నారాయన.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో కరోనా కట్టడికి ఆంక్షలు మరింత కఠినం చేయనున్నారు. ఇందులో భాగంగా బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తారు. అక్కడ కేవలం టేక్ అవేకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. బస్సులు, మెట్రో రైళ్లలో తక్కువ సీటింగ్ కెపాసిటీతో నడపేందుకు సిద్ధమైంది. కరోనా విజృంభిస్తున్నందున ప్రైవేటు సంస్థలన్నింటినీ 100శాతం వర్క్ ఫ్రం హోంకు పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది.