ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామ

ఏపీలో వైసీపీ గుర్తుతో గెలిచినా.. నిత్యం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై లోక్‌సభ ఎంపీ ఓంబిర్లాను కూడా వైసీపీ ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదన్నారు. తన కోసం వైసీపీ నేతలు పడుతున్న పాట్లను చూస్తుంటే తనకే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు.

Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

అయితే ఎంపీ పదవికి తానే రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. రాజధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌నే డిమాండ్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని వివ‌రించారు. త‌న‌పై అనర్హత వేటు వేయ‌క‌పోయినా తానే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని… వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంద‌న్న విష‌యాన్ని ఉపఎన్నిక ద్వారా తెలియ‌జేస్తాన‌ని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఏపీలో అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన త‌ప్పేంటని ఆయన నిల‌దీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులు పెడుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స‌రికాదన్నారు.

Related Articles

Latest Articles