మాది పేటీఎం బ్యాచ్ కాదు.. పసుపు సైన్యం: లోకేష్

వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని వ్యాఖ్యానించారు.

Read Also: చంద్రబాబులా కుట్రలు చేసి జగన్‌ సీఎం కాలేదు.. వైసీపీ నేతల ఆగ్రహం

తమది పేటీఎం బ్యాచ్ కాదని.. పసుపు సైన్యమని లోకేష్ తెలిపారు. రెండున్నరేళ్లు ఓపిక పడితే చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. 2019 ముందు తనపై ఏ కేసూ లేదని. ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక తనపై హత్యాయత్నం సహా 11 కేసులు పెట్టారని లోకేష్ మండిపడ్డారు. జగన్ తరహాలో తానేం తమ చిన్నాన్న జోలికెళ్లలేదన్నారు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్య కేసును తేల్చాలన్నారు. తనపై హత్యాయత్నం కేసులు పెడితే తన బండి ఆగదని.. మరింత స్పీడుగా వెళ్తుందని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడుతోన్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. 2024లో మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచి కానుకగా ఇస్తానన్నారు. ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపించామని.. వైసీపీకి పెద్ద సినిమా చూపిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles