నానికి తప్పని రిలీజ్ కష్టాలు !

నేచురల్ స్టార్ నానికి మళ్లీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. నాని తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్‌” భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు నానిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’తో సహా మూడు నాలుగు సినిమాలు ఉండగా, ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ డిసెంబర్ 24న విడుదల కానుందని ప్రకటించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మేకర్స్ కూడా అదే తేదీన సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నట్టు వస్తున్న వార్తలు నానిని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.

Read Also : “జై భీమ్”పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్

మరోవైపు ‘పుష్ప’ వాయిదా పడుతుందని, డిసెంబర్ 24కి ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డిసెంబర్ 24న వస్తే సోలో రిలీజ్ చేయాలని ‘పుష్ప’ టీమ్ చూస్తోంది. అదే గనుక జరిగితే ‘గని’ జనవరి 2022కి విడుదల తేదీని వాయిదా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ పరిణామాలన్నింటితో తలనొప్పి వచ్చేది నానికే. మరి నాని ఒత్తిడికి లోనయ్యి సినిమా తేదీని వాయిదా వేస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే పరిస్థితి చూస్తుంటే నాని కూడా వెనక్కి తగ్గేలా కన్పించడం లేదు. ఎందుకంటే ముందుగా అనుకున్న ప్రకారం ప్రమోషన్స్‌తో ముందుకు వెళ్తున్నాడు. గత రెండు చిత్రాలకు సంబంధించిన అనుభవాలు నానీని అదే తేదీకి కట్టుబడి ఉండేలా చేశాయి.

“శ్యామ్ సింగ రాయ్‌” టీజర్ ఈరోజు విడుదల కానుంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్‌” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

Latest Articles