నాగశౌర్య ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారు!

అక్టోబర్ 29వ తేదీన యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం విడుదలై మోడరేట్ సక్సెస్ ను అందుకుంది. తాజాగా అతని మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి నాగశౌర్య మేకోవర్ తో తెరకెక్కిన ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. కానీ దీనిని డిసెంబర్ కు వాయిదా వేశారు. అయితే నాగశౌర్య నటించిన ఈ 20వ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాను డిసెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను త్వరలో మొదలు పెడతామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగశౌర్య, ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని సమకూర్చగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Related Articles

Latest Articles