వైవిధ్యం కోరుకుంటున్న నాగచైతన్య!

నవతరం కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య తనదైన తీరులో సాగిపోతున్నారు. అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘లవ్ స్టోరీ’ దాకా నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లో ప్రేమకథలే ప్రధాన పాత్ర పోషించాయి. లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్న నాగచైతన్య అప్పుడప్పుడూ భిన్నంగానూ ప్రయత్నించారు.

నాగచైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి వైపు మహానటవృక్షం అక్కినేని నాగేశ్వరరావుకు మనవడు, తల్లివైపున స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడుకూ మనవడే! ఇలా రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన నాగచైతన్యకు తాత ఏయన్నార్, తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్ లాగే నటుడవ్వాలనే అభిలాష బాల్యం నుంచీ ఉండేది.

పైగా ఎటు చూసినా సినిమా వాతావరణం అలవాటవ్వడం వల్ల ఎప్పుడెప్పుడు తెరపై హీరోగా కనిపించాలన్న ఆసక్తి ఉండేది. అదే విషయాన్ని తన తొలి చిత్రం ‘జోష్’ ఆడియో వేడుకలో ఎంతో ఉత్సాహంగా చెప్పారు నాగచైతన్య. ఆ సినిమా అంత జోష్ నింపక పోయినా, రెండవ చిత్రం ‘ఏ మాయ చేశావె’ అతను కోరుకున్న విజయాన్ని అందించింది.

చైతూ కెరీర్ నే కాదు, లైఫ్ నూ మలుపు తిప్పిన చిత్రంగా ‘ఏ మాయ చేశావె’ నిలచిపోయింది. అక్కినేని అభిమానులకు ఆ చిత్రం ఎనలేని ఆనందమూ పంచింది. వెంటనే సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘100 పర్సెంట్ లవ్’ కూడా నాగచైతన్యకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమాల తరువాత వచ్చిన చిత్రాలు అంతగా అలరించలేదు. కానీ, తన నటజీవితంలో మరపురాని చిత్రంగా నాగచైతన్య పేర్కొన్న ‘మనం’లో తాత, తండ్రి, తమ్ముడు అఖిల్ తో కలసి చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది.

నాగచైతన్య కెరీర్ లో “ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మహానటి, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ” వంటి చిత్రాలు అతణ్ణి వైవిధ్యమైన పాత్రల్లో చూపించాయి. ఇప్పటికే దాదాపు ఇరవై చిత్రాలలో నటించేసిన నాగచైతన్య, ఈ నాటికీ వరైటీ రోల్స్ కే ప్రాధాన్యమిస్తూ సాగుతున్నారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ ఛద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమా 2022 ఏప్రిల్ లో జనం ముందుకు రానుంది. తండ్రి నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’లోనూ నటిస్తున్నారు. అలాగే ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యూ’లోనూ చైతూ తన బాణీ పలికించనున్నారు. ఈ మూడు చిత్రాలు ఏ తీరున చూసిన చైతూకు వరైటీ అనే చెప్పవచ్చు. మరి ఈ మూడు చిత్రాలలో చైతన్య ఏ తీరున అలరిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Latest Articles