‘మా’భవన నిర్మాణంలో ప్రకాశ్‌రాజ్‌కి ఒక విజన్‌ ఉంది: నాగబాబు

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు చేయడం కోసం ఒకప్పటి అధ్యక్షుడు మురళీమోహన్‌ ఎంతో ప్రయత్నించారు. కానీ రాజకీయ కారణాల వల్ల అది సఫలం కాలేదన్నారు. ఆయన తర్వాత వచ్చినవాళ్లు కూడా ఎన్నో సార్లు ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాలనుకున్నారు. అయితే సభ్యుల సంక్షేమం, ఇతర కారణాలపై దృష్టి సారించడం వల్ల.. ఇప్పటికీ అది వీలు కాలేదు.

భవన నిర్మాణం, నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి ఒక విజన్‌ ఉందన్నారు. ‘మా’ అసోసియేషన్‌ వృద్ధికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేదానిపై ఆయనకు ప్లానింగ్‌ ఉంది. అందుకే నేను ఆయనకు సపోర్ట్‌ చేస్తున్నానని తెలిపారు. ‘మా’ కోసం ఇప్పటివరకూ కొంతమంది అధ్యక్షులు విరాళాలు సేకరించిన మాట వాస్తవమే.. అవి ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం సేకరించారన్నారు.

‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలంటున్న మంచు విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఏకగ్రీవం చేయాలనుకుంటే.. పోటీలో నిలబడిన వాళ్లందరూ తప్పుకుని ప్రకాశ్‌రాజ్‌ని అధ్యక్షుడిని చేయవచ్చు కదా..!? నా దృష్టిలో ఏకగ్రీవం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ఏ అంశంలోనైనా పోటీ ఉండాలి.. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ అయి ఉండాలన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అందరూ కలిసి పనిచేస్తే… మరింత అభివృద్ధి సాధించవచ్చు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-