పెరుగుతున్న ముస్లిం జనాభా..

భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ విషయం ఊరకే చెప్పట్లేదు. లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. పదేళ్లకోసారి జరిగే జనగణన, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డాటాను పరిశీలించి తాజా డాటా రూపొందించారు. గత ఆరు దశాబ్దాల కాలంలో మత కూర్పులో జరిగిన మార్పులు, అందుకు దారి తీసిన కారణాలను ఇందులో విశ్లేషించారు.

2021 జనాభా లెక్కలు అందు బాటులో లేనందున 2011 లెక్కలను మాత్రమే అధ్యయనానికి తీసుకున్నారు. దాని ప్రకారం.. గత 60 ఏళ్లలో భారత దేశ జనాభాలో ముస్లింల వాటా 4 శాతం పెరిగింది, హిందువుల వాటా దాదాపు అంతే స్థాయిలో తగ్గింది. మిగత మతాల జనాభా వాటాలో పెద్దగా మార్పు లేదు. 2011 లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో హిందువులు 79.8 శాతం. 2001 జనాభా లెక్కల కంటే ఇది 0.7 శాతం తక్కువ. 1951లో దేశ జనాభాలో హిందులు 84.1 శాతంగా ఉన్నారు. ప్రస్తుతం అది 4.3 శాతం తగ్గింది. ఇదే సమయంలో ముస్లిం జనాభా పెరిగింది. 1951 నుంచి 2011 వరకు 4.4 శాతం పెరిగింది. 1951లో ముస్లింలు 9.8 శాతంగా ఉన్నారు. 2001 లో 13.4 శాతం. అలాగే 2011 నాటికి అది 14.2 శాతానికి పెరిగింది. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మిగతా 6 శాతం జనాభాలో ఉన్నారు.

ఇతర మతాలతో పోల్చినపుడు హిందు మహిళల కన్నా ముస్లిం మహిళల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం కూడా ఈ ట్రెండ్‌ చూడవచ్చు. అయితే భారత్‌లో ప్రస్తుత సంతానోత్పత్తి రేటు గతంతో పోల్చితే బాగా తగ్గింది. సగటు సంతానోత్పత్తి 1950లో 5.9 గా ఉంటే.. 1992లో అది 3.4 గా ఉండేది. నేడు, సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో 2.2 మంది పిల్లలను మాత్రమే కంటోంది. అయితే అమెరికాలో కంటే ఇది ఎక్కువే. అక్కడ సగటు సంతానోత్పత్తి 1.6. అంటే సగటున పది మంది మహిళలు తమ జీవిత కాలంలో 16 మంది పిల్లలను కంటున్నారు.

భారతీయ ముస్లింలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది. 1992 లో ప్రతి ముస్లిం మహిళకు 4.4 మంది పిల్లలు ఉండే వారు ..అంటే పది మందికి సగటున 44 మంది పిల్లలు. ఈ సంఖ్య 2015 నాటికి 2.6కు పడిపోయింది. అంటే పది మంది ముస్లిం మహిళలు సగటున 26 మందికి శిశువులకు జన్మనిచ్చారు. భారత్‌లో నెలకు సగటున 10 లక్షల జననాలు నమోదవుతాయి. ఈ జననాల రేటు ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల చైనాను 2030 నాటికి భారత్ అధిగమించే అవకాశముంది.

మిగతా భారతీయ మహిళల కంటే ముస్లిం మహిళలు ఎక్కువ మంది సంతానాన్ని కనడే వారి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అని అధ్యయనంలో వెల్లడైంది. అయితే సంతానోత్పత్తి రేట్లకు మతానికి సంబంధం ఉందని కచ్చితంగా చెప్పలేమని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం అభిప్రాయపడింది. జనసంఖ్యలో మార్పులపై వలసలు, మతమార్పిడుల ప్రభావం పెద్దగా లేదు. ఈ వ్యత్యాసాలకు సంతానోత్పత్తి రేటు కొంత వరకు కారణం కావొచ్చు.

చదువుకున్నవారు, సంపన్నులలో తక్కువ సంతానం. మహిళల విద్యాస్థాయి కూడా జనాభా మార్పులకు కారణమవుతుంది. ఉన్నత విద్యావంతులైన మహిళలు సాధారణంగా మిగతా మహిళల కంటే ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. అందుకు అనుగుణంగానే వారు తమ తొలి సంతానాన్ని కనడమనేది మిగతా మహిళల కంటే ఆలస్యంగా జరుగుతుంది. అలాగే, పేదల కంటే సంపన్నులలోనూ సంతానం తక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే మతాలకు అతీతంగా భారత్‌లో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోంది. ప్రస్తుతం సగటు భారతీయ మహిళ సంతానోత్పత్తి రేటు 2.2గా ఉంది.

ఒక జన సమూహం నివసించే ప్రాంతం..దాని చరిత్ర, సాంస్కృతిక నిబంధనలు కూడా ఆ మహిళల సంతానోత్పత్తిని నిర్దేశిస్తాయి. అయితే అవి ఏస్థాయిలో ప్రభావితం చేస్తాయో ఖచ్చితంగా చెప్పటం కష్టం.

-Advertisement-పెరుగుతున్న ముస్లిం జనాభా..

Related Articles

Latest Articles