బాలు గారి నుండి ఎన్నో నేర్చుకున్నాను: మణి శర్మ

బాలు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. “బాలు అన్నయ్యతో నా అనుబంధం చాలా దశలలో జరిగింది. నా టీనేజ్ లో మా నాన్నగారు బాలు గారు గొంతును సందర్భాను సారంగా మార్చి ఎలా పాడతారో చెప్పినప్పుడు ఆశ్చర్య పోయే వాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారి బాణీలకు బాలు గారు పాటలు పాడటం చూసి అద్భుతం అనుకునే వాడిని. నేను వాద్యకారుడుగా మారిన కొత్తలో బాలుగారు పాడుతుంటే నాన్న రికార్డింగ్ చేస్తుండే వారు. అప్పుడు చిన్న తప్పు జరిగినా నాన్న కోప్పడే వారు. బాలు గారు సర్ది చెప్పి ‘శర్మగారు పిల్లాడు బాగానే వాయిస్తున్నాడు. మీరు అరవకండి’ అంటూ నన్ను ప్రోత్సహించేవారు. ఆ తర్వాత నేను సత్యం గారి దగ్గర కీరవాణి, విద్యాసాగర్, కోటి గారి దగ్గర పని చేసినప్పుడు బాలు గారితో అనుబంధం బాగా పెరిగింది. తన కచేరీ బృందం లో ఆయన నన్ను చేర్చుకుంటా అని చెప్పినప్పుడు ఎంతో ఆనంద పడ్డాను. బాలు గారిని దేవుడు అని భావిస్తున్న రోజులవి. ఆ టైంలో ఆయనతో కలిసి దేశాలన్నీ చుట్టి వచ్చాను. ఈ సందర్భంలో ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మేమంతా కలిసి సరదాగా ఐస్క్రీం తినేవాళ్ళం, పార్టీలు చేసుకునేవాళ్ళం, మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం, క్రియేట్ చేసే వాళ్ళం. సందడి సందడిగా గడిపేవాళ్ళం. ఆయన పాడుతుంటే నేను కీ బోర్డ్ వాయిస్తూ ఏదైనా గమకం వేయగానే దాని గురించి అందరికీ చెప్పేవాళ్ళు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం మర్చిపోలేనిది” అంటారు మణిశర్మ.

బాలుకు మణిశర్మ స్వరార్చన!

ఎస్పీ బాలసుబ్రమణ్యంను దైవ సమానునిగా కొలిచే మణిశర్మ ఆయన జయంతి సందర్భంగా స్వరార్చన చేశారు. ప్రముఖ గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి ‘శ్రుతి మధురం… గతి మధురం’ అంటూ బాలు గాత్ర వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ రాసిన గీతాన్ని మణిశర్మ స్వరపరిచారు. దీనిని ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణతో పాడించారు. బాలు ఛాయాచిత్రాలతో పాటు, ఆయనకు మణిశర్మతో ఉన్న అనుబంధమూ ఇందులో కనిపించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-