విలక్షణం… రమణ గోగుల సంగీతం…

(జూన్ 13న రమణ గోగుల పుట్టినరోజు)
కొంతమందికి వృత్తి కంటే ప్రవృత్తిపైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా అదే బాటలో పయనించారు. తాను ఏ తీరున సాగినా, అందులో తనదైన బాణీ పలికించడం రమణ గోగులకు ఎంతో ఇష్టం. చదువులో మేటి అయిన రమణ గోగుల ఖరగ్ పూర్ ఐఐటీ నుండి ఎమ్.టెక్, మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అంతటితో ఆగకుండా లూసియానా యూనివర్సిటీలో ఎమ్.ఎస్., కూడా చేశారు. “లిక్విడ్ క్రిస్టల్, ఎర్తెన్ గ్లో” వంటి స్టార్టప్స్ తో వ్యాపారవేత్తగా కెరీర్ ఆరంభించిన రమణ గోగుల ‘సైబేస్’ అనే సాఫ్ట్ వేర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గానూ ఉన్నారు. రమణ ఎన్ని పదవుల్లో రాణించినా, ఆయన మనసు మాత్రం సరిగమపదనిల చుట్టూ తిరిగింది. ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందూస్థానీ, ఆపై పాశ్చాత్య స్వరాలు అన్నిటిపై మోజు పెంచుకున్న రమణ గోగుల తనకంటూ ఓ బాణీ ఏర్పరచుకున్నారు. 1996లో ‘మిస్టీ రిథమ్స్’ అనే బ్యాండ్ ఏర్పాటు చేసి ఇండీపాప్ లో తనదైన బాణీ పలికించారు. ‘ఆయ్ లైలా…’ ఆల్బమ్ ను రూపొందించి విడుదల చేశారు. దాంతో పాటే వీడియోనూ జోడించారు. ఆ రోజుల్లో ‘ఆయ్ లైలా…’ ఓ ఊపు ఊపేసింది. దాంతో దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ తన ‘ప్రేమంటే ఇదేరా!’ చిత్రం ద్వారా రమణ గోగులను చిత్రసీమకు పరిచయం చేశారు. ‘ప్రేమంటే ఇదేరా’లోని ఏడు పాటలూ వైవిధ్యంగా రూపొంది, అప్పటి కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “నైజామ్ బాబులు… నాటుబాంబులు…” సాంగ్ భలేగా సందడి చేసింది. అప్పట్లో పెళ్ళిళ్ళ సమయంలో కుర్రకారు ఖచ్చితంగా ఈ పాటను వినిపిస్తూ డాన్సులు చేస్తూ ఆనందించేవారు. ఇక ఇందులో రమణ గోగుల గాత్రంలో జాలువారిన “ఓ మేరీ బుల్ బుల్…”, “బొంబాయి బొమ్మ…” పాటలు కూడా అలరించాయి. రమణ గోగుల గొంతులోని విలక్షణమైన బాణీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.

పవన్ తో రమణ పదనిసలు…
రమణ గోగుల సంగీతం హీరో పవన్ కళ్యాణ్ ను కూడా ఆకర్షించింది. దాంతో ఆయన తాను హీరోగా రూపొందిన ‘తమ్ముడు’ చిత్రానికి రమణను స్వరకల్పనకు ఎంచుకున్నారు. పవన్, రమణ అభిరుచులు కూడా కలవడంతో వారి కాంబోలో వచ్చిన చిత్రాల్లోని పాటలు సైతం వైవిధ్యంగా సాగాయి. ‘తమ్ముడు’లోని “మేడిన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా…” పాట, “వయ్యారీ భామా…నీ హంస నడక…” వంటి పాటలు రమణ గళంలో మరింతగా అలరించాయి. పవన్ హీరోగా పూరి జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’లోనూ “ఐ యామ్ ఏన్ ఇండియన్…” సాంగ్ , “ఏ చికితా…” పాట యూత్ ను ఉర్రూతలూగించాయి. పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘జానీ’ తెరకెక్కించారు. ఈ సినిమాలోనూ రమణ గోగుల సంగీతం సందడి చేసింది. మహేశ్ బాబు ‘యువరాజు’లోనూ రమణ సంగీతం మురిపించింది. వెంకటేశ్ ‘లక్ష్మీ’ చిత్ర ఘనవిజయంలో రమణ గోగుల సంగీతం కూడా పాలు పంచుకుంది. ఇందులోని “లక్ష్మీ బావా… లక్ష్మీ బావా…” పాట సంగీతప్రియులను ఆకట్టుకుంది. నిజానికి రమణ తన సొంత బాణీ వినిపించాలనే తపించేవారు. అయితే ‘యోగి’ చిత్రం కోసం ఆ సినిమా ఒరిజినల్ కన్నడ ‘జోగి’లోని పాటను అనుసరిస్తూ “ఓరోరి… యోగి నన్ను కొరికోయ్ రో…” స్వరపరచ వలసి వచ్చింది.

సరిగమలకు దూరంగా…
పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ కు కూడా రమణ గోగుల స్వరకల్పన చేశారు. ఆ తరువాత నుంచీ రమణ బాణీల్లో రూపొందిన కొన్ని చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. అయితే ఆయన సంగీతం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తొలి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’కు కూడా రమణ సంగీతం అలరించింది.

చివరగా రమణ గోగుల సంగీతం సమకూర్చిన చిత్రం తేజ రూపొందించిన ‘వెయ్యి అబద్ధాలు’. ఇందులో కూడా రమణ తనదైన పంథాలో స్వరకల్పన చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, రమణ మాత్రం తన మార్కు మ్యూజిక్ లో “అయ్యో అయ్యయ్యో… ఏం పిల్లరో…” పాటతో ఆకట్టుకున్నారు.

ఈ మధ్య రమణ సంగీతానికి దూరంగా జరిగి, మన దేశంలోని దాదాపు 30 కోట్ల మంది రైతుల కోసం సౌరశక్తితో వ్యవసాయం అనే వేదికను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రఖ్యాత ‘స్టాన్లీ బ్లాక్ అండ్ డెకర్’ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గానూ పనిచేస్తున్నారు. తాను చదువుకున్న చదువుకు ఇప్పుడు రమణ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని అంటున్నారు. కానీ, రమణ ఎంతగానో ప్రేమించే సంగీతానికి ఆయన దూరంగా జరగడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. అయితే ఏదో ఓ రోజున రమణ మళ్ళీ తనదైన సంగీతాన్ని వినిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది ఎప్పుడు సాకారమవుతుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-