ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

IPLలో ముంబై ఇండియన్స్‌ కథ ముగిసింది. హైదరాబాద్‌పై గెలిచినా… మెరుగైన రన్‌ రేట్‌ లేకపోవడంతో… రోహిత్‌ సేనకు ప్లే ఆఫ్‌ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్‌పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్‌రైజర్స్‌ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి… కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని బాదుడుకు ముంబై స్కోరు 7.2 ఓవర్లలోనే వంద దాటింది.

ఫిఫ్టీ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన ఇషాన్‌… 32 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇషాన్‌కు తోడు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రెచ్చిపోయి ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే 82 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఇషాన్, సూర్యకుమార్‌ రేంజ్‌లో ముంబై మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. రోహిత్‌ 18, పొలార్డ్‌ 13, పాండ్యా 10 పరుగులే తీశారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది… ముంబై. 236 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన హైదరాబాద్‌కు… ఓపెనర్లు శుభారంభం అందించారు.

తొలివికెట్‌కు 5.2 ఓవర్లలో 64 రన్స్‌ జోడించారు. జేసన్‌ రాయ్‌ 34 రన్స్‌ చేయగా, అభిషేక్‌ శర్మ 33 రన్స్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ మనీష్‌ పాండే ధాటిగా ఆడటంతో… హైదరాబాద్‌ స్కోర్‌ బోర్డు ఉరకలు వేసింది. మనీష్‌ 41 బంతుల్లోనే 69 రన్స్‌ చేశాడు. మనీష్‌ ఔటయ్యాక ప్రియం గార్గ్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోవడంతో… 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది… హైదరాబాద్‌. ముంబై 42 పరుగుల తేడాతో గెలిచినా… భారీ వ్యత్యాసంతో నెగ్గకపోవడంతో… ప్లే ఆఫ్‌ దశకు చేరకుండానే IPL నుంచి నిష్క్రమించింది. 32 బంతుల్లోనే 84 రన్స్‌ చేసిన ఇషాన్‌ కిషన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

-Advertisement-ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

Related Articles

Latest Articles