తెలుగు చిత్రసీమలో సమ్మె వివాదం ఓ కొలిక్కి వచ్చింది. నిన్న ఈ రోజు సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపామని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ తెలిపారు.
వేతనాలు ఏ మేరకు పెంచాలనే విషయంలో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో కో-ఆర్డినేషన్ కమిటీని వేశామని, వారు రేపు ఉదయం కమిటీ సమావేశమౌతారని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారని, అందువల్ల రేపటి నుండి కార్మికులంతా షూటింగ్స్ కు హాజరవుతారని ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. తమ సమస్యలన్నింటినీ కో-ఆర్డినేషన్ కమిటీ ముందు ఉంచి, పరిష్కారం చేసుకుంటామని ఆయన అన్నారు. అయితే నిర్మాతలు పదిశాతం మేరకు వేతనాలు పెంచుతామని అంటుండగా, ఫెడరేషన్ నాయకులు కనీసం 30 శాతం పెంచమని కోరుతున్నట్టు తెలుస్తోంది.