మంజు వారియర్, సన్నీ వేనె, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘చతుర్ ముఖం’ ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఇప్పుడీ టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులో డబ్ చేసి ఆహాలో ఈ నెల 13న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రేక్షకాదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రంజిత్ కామల శంకర్ డైరెక్ట్ చేశారు. మలయాళ మాతృక ‘చతుర్ ముఖం’ బుసాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, చుంచియాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మేలిస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్… ఇలా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. విశేషం ఏమంటే… ఈ సినిమా నిర్మాణంలో కథానాయిక మంజు వారియర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ మూవీ తెలుగు పోస్టర్ ను గురువారం విడుదల చేశారు.
తేజస్విని అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ జీవితం చుట్టూ తిరిగే కథే ‘చతుర్ముఖం’. స్నేహితుడు ఆంటోనితో కలిసి ఆమె సీసీటీవీ సొల్యుషన్స్ వ్యాపారాన్ని చేస్తుంటుంది. మొబైల్ ఫోన్ వాడకానికి ఆమె విపరీతంగా అలవాటు పడుతుంది. ఓ ప్రమాదంలో ఆ ఫోన్ పని చేయకుండా పోతుంది. దాంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఓ మొబైల్ ఫోన్‌ను తేజస్విని కొనుగోలు చేస్తుంది. ఫోన్ వచ్చినప్పటి నుంచి ఆమె చుట్టూ అతీంద్రీయ శక్తుల ప్రభావంతో కొన్ని పనులు జరుగుతుంటాయి. అవి ఆమె ఉనికికే ప్రమాదంగా మారుతాయి. ఇలాంటి ప్రమాదం నుంచి తేజస్విని ఎలా బయపడింది? ఎలాంటి పరిష్కారం ఆమెకు లభించింది? అనేదే ఈ చిత్ర కథ. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘చతుర్ ముఖం’ సినిమా తెలుగు ప్రేక్షకులకు సైతం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందనే ఆశాభావాన్ని ఆహా సంస్థ వ్యక్తం చేస్తోంది.