కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రకటనలు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వాటి అప్ డేట్స్ వస్తాయో రావో తెలియని పరిస్థితి. అయితే కోట్లాది మంది అభిమానులను స్పెషల్స్ డేస్ సమయంలో నిరుత్సాహ పరచడానికి మన స్టార్ హీరోలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పేండమిక్ సిట్యుయేషన్ ను అర్థం చేసుకుంటూనే, సోషల్ మీడియా ద్వారా తమ చిత్రాల అప్ డేట్స్ ఇస్తే తప్పేంటీ అనే భావనను కొందరు స్టార్స్, అలానే వారితో సినిమాలు తీస్తున్న, తీయబోతున్న దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ రకంగా ఈసారి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31న ఏకంగా మహేశ్ బాబుకు సంబంధించిన ట్రిపుల్ థమాకా ఉండబోతోందట. ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. విదేశాల్లో జరిగిన ఈ మూవీ షూటింగ్స్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ అయినా… రిలీజ్ చేస్తారని అభిమానులు కొద్ది రోజులుగా ఆశపడుతున్నారు. అది మే 31న జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అలానే ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ కూడా అదే రోజు విడుదల అవుతుందట. ఇక ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు నటించబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ షూటింగ్ మొదట్లో మే 31నే మొదలవుతుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది జరిగే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే ఆ మూవీ టైటిల్ ను రివీల్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. హారిక అండ్ హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ లో మహేశ్ బాబు చేయబోతున్న ఈ సినిమాకు తివ్రికమ్ ‘అ’ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ‘అతడే పార్థు’ అనే టైటిల్ పెట్టబోతున్నాడని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది.
ఇక త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేశ్ బాబు గ్రేట్ క్రియేటర్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆ సినిమా ఇంకాస్తంత వెనక్కి వెళ్ళ వచ్చని, ఆ స్థానంలో ‘ఎఫ్-3’ షూటింగ్ పూర్తి చేసి, అనిల్ రావిపూడి మహేశ్ తో రెండో సినిమా చేస్తాడని అంటున్నారు. సో… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం మే 31 రాబోతోందట. ఈ రకంగా మహేశ్ బాబు రాబోయే సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్, ప్రెజెంట్ సెట్ మీద ఉన్న మూవీ మేకింగ్ వీడియో ఆయన అభిమానుల్లో కొత్త జోష్ నింపబోతోందట!!