‘మా’ ఎన్నికలకు ముందే అసలు ‘సినిమా’ మొదలైందా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించబోతున్నాయి. కేవలం రెండేళ్లపాటు ఉండే మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నటీనటులు తీవ్రంగా పోటీపడుతున్నారు. కేవలం 900మంది సభ్యులు ఉండే మా అసోసియేషన్ కు నిర్వహించడం ఈసారి కత్తిమీద సాములా మారింది.

నటీనటుల మధ్య నెలకొన్న ఈగోల వల్ల ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపింపజేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటుండటంతో మా పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరో నెలరోజుల్లోనే మా ఎన్నికలు ఉంటాయని ప్రకటించడంతో ‘మా’లో ఎన్నికల వేడి రాజుకుంది.

‘మా’ అధ్యక్ష పదవి కోసం ఈసారి ఐదుగురు పోటీపడుతుండటం విశేషం. అయితే ప్రధానంగా పోటీ రెండు ప్యానెళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, సీనియర్ నటి జీవితా రాజశేఖర్, నటి హేమ, నటుడు సీవీఎల్ నరసింహారావులు తమ ప్యానెళ్లతో పోటీకి సిద్ధంగా ఉన్నారు.

ప్రకాశ్ రాజ్ గతేడాది కాలం నుంచి ‘మా’ ఎన్నికల్లో పోటీకి ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకొని అందరికంటే ముందుగానే తన ఫ్యానెల్ ను ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ కు మెగాబ్రదర్ నాగబాబు డైరెక్ట్ గా మద్దతు ఇవ్వడంతో మెగా సపోర్టు ఆయనకే ఉంటుందని ఫ్రూవ్ చేసుకున్నారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానల్లో ఒకరికిద్దరి పోటీ చేసే అర్హత లేనందున వారి స్థానంలో వేరే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నటి హేమ మహిళా కార్డుతో అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు. ఈమె పోటీ చివరి వరకు ఉంటుందా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

ప్రకాశ్ రాజ్ కు మెగా సపోర్టు ఉండగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణుకు కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ సపోర్టు ఉందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఒకరేమో ‘మా’ సంక్షేమాన్ని నినాదంగా ఎత్తుకోగా మరొకరు ‘మా’కు భవనం కట్టిస్తానంటూ పోటీకి సై అంటున్నారు. జీవితా రాజశేఖర్ ‘మా’ సెక్రటరీ పోస్టు కోసం పోటీపడుతున్నారు. అయితే ఇండిపెండెంట్ గా ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

అటూ ప్రకాశ్ రాజ్ ప్యానల్.. ఇటు విష్ణు ప్యానెల్ మద్దతుతో ఇండిపెండెంట్ గా ఆమె గెలువాలని చూస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. సీవీఎల్ నరసింహరావు తెలంగాణవాదంతో పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోకల్.. నాన్ లోకల్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘మా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు.

నటి హేమ ఇటీవల ‘మా’ అధ్యక్షుడు నరేష్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో దీనికి కౌంటర్ గా నరేష్, జీవితలు మీడియా సమావేశం పెట్టి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సభ్యుల మధ్య మాటలు శృతిమించుతుండటంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ‘మా’ సభ్యుల బహిరంగ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలంటూ క్రమశిక్షణ కమిటీకి లేఖను రాశారు.

జీవితా రాజశేఖర్ ‘మా’ సెక్రటరీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆ పోస్టును మంచు విష్ణు ప్యానెల్ జీవితకు రిజర్వు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇండిపెండెంట్ పోటీచేసి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తోపాటు మంచు విష్ణు ప్యానెల్ సపోర్టు పోందాలని భావిస్తున్నారట. దీంతో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆమెపై పోటీకి ఎవరినీ పెట్టాలా? లేదా అనే ఆలోచన పడినట్లు తెలుస్తోంది.

ఎప్పటి నుంచి ‘మా’ ఎన్నికల కోసం ప్లాన్ చేస్తున్న ప్రకాశ్ రాజ్ సెక్రటరీ పదవీ విషయంలో రాజీ పడుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్‌ పదవి కోసం రాజశేఖర్ మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్‌ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నిలబెడుతారని సమాచారం అందుతోంది.

మహిళా కోటా కింద నటి హేమ అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్నారు. దీంతో ఆమెను పోటీ నుంచి తప్పించి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఏదో ఒక పదవికి కట్టెబట్టాలని చూస్తున్నారట. ఇక ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న నరేష్ గ్రూపు ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారనుంది. ఈయన వర్గం మంచు విష్ణుకు మద్దతు ఇస్తున్నట్లు కన్పిస్తున్నా చివరి నిమిషంలో ఏదైనా జరుగవచ్చనే టాక్ విన్పిస్తోంది.

ప్రకాష్ రాజ్ టీంలోని ఉన్న సీనియర్ నటి జయసుధ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమేనని అంటున్నారు. మంచు ఫ్యామిలికి ఆమె అత్యంత సన్నిహితంగా ఉంటారు. దీంతో ఆమె మంచు విష్ణుకు వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం లేదనేది ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలు అని చెప్పుకునే ‘మా’ సభ్యులు ఎన్నికల దగ్గర పడుతుండటంతో వ్యక్తిగతంగా కలుస్తూ విందు రాజకీయాలకు తెరతీస్తున్నారు.

ఎన్నికల నాటికి పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్కలు తారుమారు కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎవరికీ వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకెళుతుండటంతో చివరి వరకు అభ్యర్థులు ఎవరి పక్షానికి మద్దతు పలుకుతారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ‘మా’ ఎన్నికల సాధారణ ఎన్నికలను తలపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-