‘మా’లో ముసలం మొదలు కాబోతోందా!?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే రాజీనామాల పర్వం మొదలైంది. గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హుందాగా తమ ఓటమిని అంగీకరించి, ముందుకు సాగిపోయారు. లేదంటే మౌన ప్రేక్షకుడి పాత్రపోషించారు. కానీ ఆదివారం ఫలితాలు రాగానే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు వెనక బాసటగా ఉన్న నాగబాబు ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ రోజు ఉదయం ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడిన ప్రకాశ్ రాజ్ సైతం రాజీనామా చేశారు. తెలుగు వ్యక్తులకు మాత్రమే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండే విధంగా బైలాస్ లో సవరణ చేస్తామని మంచు విష్ణు వర్గంప్రచారం చేసిందని, దానిని తాను స్వాగతించలేనని, ఇక మీద తెలుగు సినిమాలలో నటిస్తాను తప్పితే, ‘మా’లో సభ్యుడిగా ఉండనని ప్రకాశ్ రాజ్ మీడియా ముందు తెలిపారు. అంతేకాదు… అసలు కథ ఇప్పుడే మొదలైందని ఆయన సమావేశం చివరిలో వ్యాఖ్యానించారు. ఈ మాటలు చాలా మందిని ఆలోచనలో పడేస్తున్నాయి. ‘మా’కు ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ప్యానెల్ నుండి గెలిచిన వారి పరిస్థితి ఏమిటనేది వెయ్యి డాలర్ల ప్రశ్న! వీరిని అనుసరిస్తూనే వాళ్ళు కూడా ‘మా’ పదవులకు రాజీనామా చేస్తారా? లేక కొత్త కార్యవర్గంలో కొనసాగుతారా? అనే సందేహం ఉదయిస్తోంది. ఒకవేళ రాజీనామా చేస్తే ‘మా’ ఎన్నికల ప్రక్రియ అంతా ఓ ప్రహసనంగా మారిపోతుంది. ‘మా’ లో ముసలం మొదలైనట్టే అవుతుంది. అలా కాకుండా ఈ రాజీనామాల హంగామా ఇక్కడితో ఆగిపోయినా, రేపు ‘మా’ పీఠాన్ని అధిరోహించే వారు ఈ ఇద్దరి రాజీనామాలను అంత తేలికగా ఆమోదిస్తారని అనుకోలేం. ఒకవేళ తెలుగు సినిమాలలో నటించాలంటే ‘మా’లో సభ్యత్వం తప్పనిసరి అనే సవరణ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో ‘మా’ను, ‘మా’ ఎన్నికలను గౌరవించని వారితో ఇతరులు నటించకూడదని లోపాయికారిగా ఓ నిర్ణయం తీసుకున్నా, తీసుకోవచ్చు. ఇప్పటి వరకూ ‘మా’ సభత్వం లేని ఆర్టిస్టులకు సంబంధించిన ఏదైనా వివాదం ‘మా’ దృష్టికి వస్తే వారు దానిని స్వీకరించడం జరగడం లేదు. సో… రేపు ప్రకాశ్ రాజ్ కు ఎవరైనా నిర్మాతలకు మధ్య గొడవ జరిగితే ‘మా’ అందులో వేలు పెట్టకపోవచ్చు.

వీటన్నింటి కంటే చాలామందిని కలతకు గురిచేస్తున్న అంశం మరొకటి ఉంది. ఇప్పుడు ప్రకాశ్ రాజ్, నాగబాబు అండ్ కో ‘మా’కు వ్యతిరేకంగా ఏదైనా కొత్త అసోసియేషన్ ను ఏర్పాటు చేయబోతోందా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ ఖండిచారు కానీ ‘అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది’ అని ఆయన అనడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మొత్తం మీద ‘ఎన్నికల వరకూ మాత్రమే మేం వేర్వేరు, ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత అంతా ఒక కుటుంబం, ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తాం’ అని అందరూ, అందరి ముందు చెప్పిన మాటలు కేవలం నీటి మూటలనేది తేలిపోయింది. ఇక్కడ అందరూ ‘మా’ సభ్యుల సంక్షేమానికంటే ‘ఇగో’కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది!!

-Advertisement-'మా'లో ముసలం మొదలు కాబోతోందా!?

Related Articles

Latest Articles