దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం

బిడ్డలను కడుపులోపెట్టుకొని చూసే తల్లులను చూసే ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన తల్లులు గురించి వినే ఉంటాం. కానీ, ఇక్కడ ఒక తల్లి మూఢనమ్మకాలకు పోయి కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా కడతేర్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మైసూరు జిల్లా హెచ్‌.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. వీరికి శ్రీనివాస్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే భవాని గత కొన్ని రోజుల నుంచి తనకు దేవుడు పూనుతున్నాడని, కలలోకి వచ్చి ఏవేవో చెప్తున్నాడంటూ చెప్పుకొస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త విడిగా ఉంటున్నాడు. దీంతో కొడుకు శ్రీనివాస్ తో కలిసి భవాని ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేవుడు పూనాడాని చెప్పి ఎవరికి తెలియకుండా కొడుకును అతి కిరాతకంగా కొడవలితో గొంతుకోసి హతమార్చింది. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భవానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మైసూర్ లో సంచలనంగా మారింది.

Related Articles

Latest Articles