రివ్యూ : ‘మనీ హేస్ట్’ సీజన్ 5 పార్ట్ 1

ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది ‘మనీ హేస్ట్’ మాత్రమే. స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఇప్పుడు ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. తాజాగా ఈ వెబ్ సీరిస్ చివరి సీజన్ కు సంబంధించిన పది ఎపిసోడ్స్ లో ఐదు ఎపిసోడ్స్ ను ఈ నెల 3న నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ చేసింది. దీనిని తెలుగు డబ్బింగ్ వర్షన్ లో కూడా చూసే అవకాశం ఉంది. ఇక ఈ ఆఖరి సీజన్ కు చెందిన బాలెన్స్ 5 ఎసిసోడ్స్ ను డిసెంబర్ 5న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

మంచి – చెడు అనేది చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. దొంగతనం నేరం. కానీ ఓ వ్యక్తి తన వారి కడుపు నింపడానికి గత్యంతరం లేక ఆ పని చేస్తే, ఆ తప్పును కూడా సానుభూతితో చూసేవారు ఉంటారు. ‘మనీ హేస్ట్’ వెబ్ సీరిస్ మొత్తం ఇదే పాయింట్ మీద నడుస్తోంది. ఇందులోని ప్రధాన పాత్రధారులు దోపిడి దొంగలు. అయితే… వారి చర్యలను ఛీత్కరించాల్సిన స్థితి దాటి వారి జీవన్మరణ సమస్య వ్యూవర్స్ లో ఊహకందని ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రొఫెసర్ సూచనలకు అనుగుణంగా నడుస్తున్న దొంగల ముఠాను మిలటరీ అధికారులు అడ్డుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. పైకి క్రైమ్, యాక్షన్ డ్రామాగా ఇది కనిపించినా, కథను ప్రెజెంట్ నుండి ఫ్లాష్‌ బ్యాక్ కు తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడకు తీసుకు రావడంతో ఆసక్తికరంగా సాగుతూ వస్తోంది. ఇందులోని ప్రధాన పాత్రధారులకు ప్రముఖ నగరాల పేర్లు పెట్టడం వీక్షకులకు ఆసక్తిని కలిగించడానికి మరో కారణం!

ఇంతవరకూ జరిగిన కథను సూక్ష్మంగా చెప్పుకోవాలంటే… ప్రారంభంలో ఓ బ్యాంక్‌ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది టోక్యో. ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్‌. ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్‌ చేస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్‌ బ్రదర్ బెర్లిన్ కూడా ఉంటాడు. ఆ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు మరొకరికి తెలియవు. బట్… ప్రొఫెసర్‌ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ఈ వెబ్ సీరిస్ కు హైలైట్ అనే చెప్పాలి. పైగా ఇందులో లెక్కకు మిక్కిలి పాత్రలు ఉన్నా… ప్రతి పాత్రకూ ఓ మేనరిజమ్, ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్, అలానే డైలాగ్ డెలివరీ వంటివి పెట్టారు. దాంతో స్క్రీన్ ప్రెజెన్స్ తో నిమిత్తం లేకుండా ప్రతి పాత్రనూ ఎవరో ఒకరు అభిమానించేలా, ఆరాధించేలా చేశాడు దర్శకుడు అలెక్స్ పినా. అదే ఈ సీరిస్ విజయానికి కారణం. పైగా క్యారెక్టర్స్ మధ్యలో రిలేషన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్స్ కు ప్రాధాన్యం ఇచ్చాడు.

ఇక తాజా సీరిస్ ముగింపుకు ప్రారంభం అని చెప్పాలి. నాలుగో సీజన్ ఎక్కడ ముగిసిందో… అక్కడి నుండే ఈ కథను మొదలు పెట్టారు. అయితే…. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లోపల స్టక్ అయిన ప్రొఫెసర్ గ్యాంగ్ సర్వైవ్ అవుతారా? లేదా చనిపోతారా? అసలు వాళ్ళు చేస్తోంది కరెక్టా? తప్పా? వాళ్ళకు విముక్తి అనేది లభిస్తుందా? లేదా? అన్నది ఈ ఆఖరి సీజన్ లో తేలిపోనుంది. నిజానికి ముందు చెప్పినట్టుగా ఈ ముఠా చేసిన తప్పొప్పుల గురించి వ్యూవర్స్ పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయిపోయింది. ఈ యాంటీ హీరోలకు విజయం దక్కిందా లేదా అన్న ప్రశ్నే మిగిలి ఉంది. కొన్ని తప్పులకు కారణాలను చూపించొచ్చు. కానీ ఈ వెబ్ సీరిస్ లోని ఈ ముఠా చేసిన అకృత్యాలకు మాత్రం జన్యూన్ రీజన్స్ ను రచయిత, దర్శకుడు ఇంతవరకూ చూపించకపోవడంతో వీళ్ళను క్రిమినల్స్ గానే చూడాల్సి ఉంటుంది. అయితే చేసిన చెడు పనులకు వారు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందనేదే ఇందులో కీలకం. గత నాలుగు సీజన్స్ లో మాదిరిగానే టోక్యో ఇప్పుడూ కథను చెప్పింది. కానీ కాస్తంత భారంగా ఇది సాగింది. ముందు సీజన్స్ లానే ఇందులోనూ కొత్త పాత్రలు మనకు ఎదురవుతాయి. అయితే దర్శకుడు వీక్షకులలో ఆసక్తి కలగడం కోసం వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో చూపలేదు. మరో ఐదు ఎపిసోడ్స్ బాలెన్స్ ఉన్నాయి కాబట్టి… ముగింపులోనే పూర్తి స్థాయిలో ఆ పాత్ర నేపథ్యాలను వెల్లడించే ఆస్కారం ఉంది.

నటీనటుల నటన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నజ్వా నిమ్రి, అల్వారో మోర్టే, ఎన్రిక్ ఆర్స్, జైమ్ లోరెంట్, ఎస్తేర్ అసిబో, ఫెర్నాండో కాయో, జోస్ మాన్యువల్ పోగా, బెలోన్ క్యూస్టా తదితరులు ఇప్పటికే తమదైన నటనతో వ్యూవర్స్ మనసుల్ని దోచేశారు. అయితే… మేకింగ్ పరంగా ఈ సీరిస్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్ ను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్ తో పోల్చుకునే స్థాయిలో అవి ఉన్నాయి. వీక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకునే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మించిన విషయం ప్రతి ఫేమ్ లోనూ తెలుస్తోంది. అందువల్ల దీనికి ఏ రకంగానూ వంక పెట్టడానికి లేకుండా పోయింది. అయితే… డిసెంబర్ 5న స్ట్రీమింగ్ అయ్యే చివరి ఐదు ఎపిసోడ్స్ తోనే ‘మనీ హీస్ట్’ ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరిచిందనేది తేలుతుంది.

ప్ల‌స్ పాయింట్స్
న‌టీన‌టుల న‌ట‌న‌
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
యాక్ష‌న్ ఎపిసోడ్స్
ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్

మైన‌స్ పాయింట్స్
పాత్రల జ‌స్టిఫికేష‌న్ ఇంకా చూప‌క‌పోవ‌డం
క్ల‌యిమాక్స్ కోసం ఇంకా ఆగాల్సి రావ‌టం

రేటింగ్ : 3.25

ట్యాగ్ లైన్
ఉత్కంఠ‌భ‌రితం

SUMMARY

ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది 'మనీ హేస్ట్' మాత్రమే. స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-