పెట్రో ధరాఘాతం: అప్పుడు కాంగ్రెస్ ది..వసూళ్లు మోడీవా?

బాదితే.. అలా ఇలా కాదు.. జకీర్ హుస్సేన్ తబలా వాయించినట్లు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు ఉండాలి అన్నట్లుగా మోదీ సర్కారు తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూ దానికి దేశభక్తి అనే ట్యాగ్ తగిలించడం బీజేపీకే సర్కారుకే చెల్లించిందని కాంగ్రెస్ వాదులు విమర్శిస్తున్నారు.. ప్రభుత్వాలు అప్పులు చేసినప్పుడు తిరిగి చెల్లించక తప్పదు. అలా చెల్లించే క్రమంలో ప్రజలపై ఏ రేంజులో బాదుతామో మోదీ సర్కారు అందరికీ అర్థమయ్యేలా చూపిస్తోంది. ఒకటికి మూడింతలు అన్న రీతిలో మోదీ సర్కారు పన్నులు వసూలు చేస్తుండటం చూస్తుంటే ప్రతీఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే..!

అభివృద్ది పేరుతో పాలకులు అందినకడల్లా అప్పులు చేయడం కామన్ అయిపోయింది. అయితే వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ప్రభుత్వాలు ప్రజలపై అసలు కంటే అధికంగా భారం మోపడం శోచనీయంగా మారింది. ప్రభుత్వాలు అప్పులు చేస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ప్రజలేనని బీజేపీ సర్కారు తీరుతో ఇప్పుడు అర్థమవడం ఖాయంగా కన్పిస్తోంది.

గత యూపీఏ ప్రభుత్వం పెట్రో బాండ్ల పేరుతో నాడు రూ.1.34 లక్షల కోట్లను సేకరించింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులు కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు బాండ్లకు చెల్లించాల్సిన మొత్తం బకాయిల విలువ రూ.10వేల కోట్లు. అలాంటప్పుడు సరిగ్గా రూ.10వేల కోట్లు కాకున్నా.. రూ.12వేల కోట్లో.. 15వేల కోట్లో వసూలు చేసేలా ప్లాన్ చేయటాన్ని ఎవరూ తప్పుబట్టారు. కానీ ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే 33వేల కోట్లు వసూలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.10వేల కోట్ల మొత్తాన్ని వసూలు చేయటం కోసం మోదీ సర్కారు ఇష్టానుసారంగా ప్రజల మీద పెట్రోల్ ధరల్ని పెంచుకుంటూ పోయింది. పెరిగిన ధరలతో పెట్రో ఉత్పత్తుల మీద అదనంగా ఈ ఏడాది వచ్చే ఎక్సైజ్ ఆదాయం ఎంతో తెలుసా? అంటే అక్షరాల లక్ష కోట్లు అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

గత ఏడాది వసూళ్లతో పోలిస్తే దాదాపు రూ.33వేల కోట్ల మేర వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అప్పులకు చెల్లించాల్సిన రూ.10వేల కోట్లకు బదులుగా మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న మాట. ఈ బాదుడు చూస్తుంటే మోడీ సర్కారు తీరు ఏమిటన్నది అందరికీ ఇట్టే అర్థమైపోతుంది.

కరోనాతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఇప్పుడున్నంత భారీగా పెంచాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ సర్కారు పన్ను ఆదాయం మీదే ప్రధాన ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తుంది. దీంతో ప్రభుత్వం ప్రజల జేబులకు పెద్దబొక్క పెడుతోంది. అదేమని ప్రశ్నిస్తే.. ఇలా వసూలు చేసిన పన్నులతో రక్షణ సామాగ్రిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ అది నిజమే అనుకున్నా.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పలు పోర్టులు.. రోడ్లు ఇలా అన్నింటిని అమ్మేయటం దేని కోసం? అన్న ప్రశ్న తెలెత్తుతోంది. ఈ ఏడాది చమురు బాండ్ల మీద 10వేల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఏకంగా 33వేల కోట్ల మేరకు వసూలు చేస్తుందని అంచనా కడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇది మరింత ఉంటుందని నిపుణులు చెబుతుండటం ఆందోళన రేపుతుంది.

ఆ లెక్కలు చూస్తే ప్రతీఒక్కరికి చమటలు పట్టక మానదు. 2023-24లో ప్రభుత్వం రూ.31,150 కోట్లు.. 2024-25లో రూ.52,860.17 కోట్లు.. 2025-26లో రూ.36,913 కోట్లను చమురు సంస్థలకు చెల్లించాలని భావిస్తోంది. దీంతో ఈ లెక్కన ప్రభుత్వం ఏ మేరకు బాదుతుందో అర్థం చేసుకోవచ్చు.. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్లే పన్నులను బాదుతుందా? లేదంటే రీసౌండ్ వచ్చేలా బాదుతుందా? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇది వచ్చే ఎన్నికల్లోనే తేలనుంది. ఏదిఏమైనా ఈ పన్నుల భారంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారుతుండటం శోచనీయంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-