స్వరవిన్యాసాల ఎమ్.ఎమ్.శ్రీలేఖ

(సెప్టెంబర్ 8న శ్రీలేఖ పుట్టినరోజు)

‘పిట్ట కొంచెం… కూత ఘనం…’ అనే మాటకు నిర్వచనం చెప్పిన ధీశాలి ఎమ్.ఎమ్.శ్రీలేఖ. పదేళ్ళు నిండాయో లేదో పదనిసలు పలికిస్తూ ఓ సినిమాకు సంగీతం సమకూర్చారు. అప్పట్లో అందరూ బాలమేధావిగా శ్రీలేఖను కీర్తించేవారు. అంత పసితనంలోనే సరిగమలతో సావాసం చేస్తూ బాణీలు కట్టిన శ్రీలేఖ అంటే అందరూ ముద్దు చేసేవారు. దాసరి నారాయణరావు ‘నాన్నగారు’తో శ్రీలేఖ తెలుగునాట తొలిసారి స్వరాలు పలికించారు. అంతకు ముందు విజయ్ హీరోగా నటించిన ‘నాలయై తీర్పు’ చిత్రానికి మొదటిసారి సంగీతం సమకూర్చారు శ్రీలేఖ. ఆ తమిళ చిత్రంలో బాలు పాడిన “ఆయిరమ్ ఎరిమలై…” పాట తమిళ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. దాసరి తెలుగులో అవకాశం కల్పించిన తరువాత సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు శ్రీలేఖను బాగా ప్రోత్సహించారు.

దాసరి దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన ‘కొండపల్లి రత్తయ్య’కు శ్రీలేఖ సంగీతం ఎస్సెట్ గా నిలచింది. ఈ సినిమా తరువాత నాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’కు కూడా శ్రీలేఖ స్వరకల్పన చేసి అలరించారు. అందులోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారానే ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ “మంచుకొండల్లోన చంద్రమా…” పాటతో పరిచయం అయ్యారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఓహో నా పెళ్ళంట, ధర్మచక్రం’ చిత్రాలకు కూడా శ్రీలేఖనే బాణీలు కట్టారు. ముఖ్యంగా వెంకటేశ్ లాంటి స్టార్ హీరో ‘ధర్మచక్రం’కు శ్రీలేఖ లాంటి చిన్నారి స్వరకల్పన చేయడం అప్పట్లో విశేషంగానే చెప్పుకున్నారు. ఇందులోని “ధీర సమీరే… యమునా తీరే…” పాట విశేషంగా అలరించింది. అందులోనే రూపొందిన “చెప్పనా చెప్పనా చిన్నమాట…”, “సొగసు చూడ హాయి హాయిలే…” వంటి పాటలూ ఆకట్టుకున్నాయి. ‘ప్రేమించు’ చిత్రంలో “కంటేనే అమ్మ అనీ అంటే ఎలా…” పాట కూడా జనాన్ని భలేగా మురిపించింది. అంతకు ముందు వేలాది పాటలు రాసిన సినారెకు ఈ పాటతోనే తొలి నంది అవార్డు అందుకున్నారు. “ప్రేయసి రావే, అమ్మాయే నవ్వితే, అమ్మాయి బాగుంది, శ్రీకృష్ణ 2006, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్- చందనా సిస్టర్స్, చట్టం, పవిత్ర” వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చి అలరించారు శ్రీలేఖ. చివరగా తన చిన్నాన్న విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవల్లి’ సినిమాకు ఆమె స్వరకల్పన చేశారు. ఇప్పటికీ తన దరికి చేరిన చిత్రాలకు సంగీతం సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారామె.

స్వరకల్పనతోనే కాదు, తన గళంతోనూ శ్రీలేఖ అలరించారు. పలు చిత్రాల్లో ఆమె పాటలు పాడి మురిపించారు. తన అన్న ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో పాటలు పాడటమంటే ఎంతో ఇష్టం అని చెప్పుకొనే శ్రీలేఖ, ఆయనకు అసోసియేట్ గానూ పనిచేస్తుంటారు. మునుముందు శ్రీలేఖ మరిన్ని మంచి పాటలతో అలరిస్తారని ఆశిద్దాం.

Related Articles

Latest Articles

-Advertisement-