ఎన్నికల ఖర్చు అంచనాలను మించి పోతుందా..?

పోటీ ఉంటే ఎన్నికల్లో ఖర్చు అంచనాలను మించిపోతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ల్లో ఏకగ్రీవం అయ్యేచోట కూడా అభ్యర్థులకు కోట్లకు కోట్లు చేతి చమురు వదిలిపోతోందట. వీటికితోడు క్యాంపు రాజకీయాలకు ముందస్తున్న సన్నాహాలు ఊపందుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

12 లోకల్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో 9 వేల మందికిపైగా ఓటర్లు..!
క్యాంప్‌ రాజకీయాలకు ముందస్తు ఏర్పాట్లు..!

తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న 12 స్థానాల్లో 9వేల 7 వందల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరంతా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లు. అన్నిచోట్లా అధికార టీఆర్‌ఎస్‌కే మెజారిటీ. కొన్నిచోట్ల కాంగ్రెస్‌.. మరికొన్నిచోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. ఇంకొన్నిచోట్ల స్వతంత్రులుగా మాజీ ఎమ్మెల్యేలు.. సీనియర్‌ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ సమయానికి ఎంత మంది బరిలో ఉంటారో కానీ.. క్యాంపు రాజకీయాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి పార్టీలు.

ఏకగ్రీవాలు అయ్యేచోట కూడా క్యాంపుల కోసం డిమాండ్స్‌..!

సాధారణంగా పోటీ ఉంటే.. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పంట పండుతుంది. డిమాండ్ ఉంటే ఖర్చు అంచనాలకు అందదు. క్యాంపు రాజకీయాలకు తెరతీస్తే మరింత చేతి చమురు వదిలిపోతుంది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌తోపాటు.. తెలంగాణలో పలు రిసార్ట్‌లను బుక్‌ చేసి ఉంచారట నాయకులు. రాష్ట్రంలో అన్నీ బుక్కైపోవడంతో బీదర్‌, గుల్బర్గాలలలోని రిసార్ట్‌లకు అడ్వాన్స్‌లు ఇచ్చి ఉంచారట. ఎలాగూ రిసార్ట్‌లు బుక్‌ చేశారని తెలిసో ఏమో.. ఏకగ్రీవాలు అయ్యే చోట కూడా క్యాంపులకు తీసుకెళ్లాలనే డిమాండ్స్‌ వినిపిస్తున్నాయట. అయితే వాటికి క్యాంపులు అని కాకుండా విహారయాత్ర పేరుతో ఖర్చు మొత్తం అభ్యర్థి ఖాతాలో వేయడానికి చూస్తున్నారట ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.

రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఖర్చు..!

పోటీ ఉన్నచోట ఎలాగూ క్యాంపు రాజకీయాలు తప్పవు. ఒక్కో జిల్లా పరిధిలో ఐదారు వందల నుంచి వెయ్యిమందికిపైగా ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారపార్టీకి ఉన్నారు. ఇంతమందిని క్యాంపులకు తరలించాలంటే ఒక రిసార్ట్‌ సరిపోదు. అందుకే రెండు మూడు ప్లేస్‌లను ముందుగానే ఎంపిక చేసి పెట్టుకున్నారట. ఈ విధంగా ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి పోటీ ఉన్నా.. లేకపోయినా 15 కోట్ల నుంచి 20 కోట్లు ఖర్చు అవుతున్నట్టు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. పోలింగ్‌ జరగకున్నా ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. యాత్రల పేరుతో రిసార్ట్‌లకు తీసుకెళ్లి సంతృప్తి పర్చాల్సిందేనని చెబుతున్నారు.

‘మీకేం కావాలి? లోటు రానివ్వం’ అని హామీలు..!

నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కాగానే.. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తీసుకెళ్లేలా ప్రణాళికలు వేసుకుంటున్నారట నాయకులు. నిధులు, విధులు లేక అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ ఎంపీటీసీలు చివరి నిమిషంలో హ్యాండివ్వకుండా ఓ కన్నేసి ఉంచారట. మీకేం కావాలి? మీకెలాంటి లోటు రానివ్వం..! అని ఓ లెక్క చెబుతున్నారట. మొత్తానికి ఏకగ్రీవమైనా.. లేక ఎన్నికైనా బరిలో దిగితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక తప్పడం లేదు. టెన్‌ సీఆర్‌.. ట్వంటీ సీఆర్‌ అంటే లెక్కే లేకుండా పోయింది.

Related Articles

Latest Articles