పొలిటికల్ స్క్రీన్ పై జీవించేస్తున్న ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరు..?

ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. కళాకారుడు కూడా. అవకాశం వస్తే క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేస్తేస్తారు. ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్‌ పై జీవించేస్తున్నారు. ప్రమోషన్ల కాలం కావడంతో భజన డోస్‌ పెంచేశారు ఆ ఎమ్మెల్యే. అసెంబ్లీలో ప్రాసలతో నవ్వులు పూయించి.. మార్కులు కొట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ప్రాసల భజన డోస్‌ ఎక్కువైందా?

కరణం ధర్మశ్రీ.. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే. రాజకీయం వృత్తి అయితే కళారాధన ప్రవృత్తి. నాటకాలు.. సినిమాల్లో వేషాలంటే విపరీతమైన అభిమానం. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా అవకాశం వస్తే తనలోని కళాకారుణ్ణి తట్టిలేపుతారు. వేదిక ఏదైనా తన కోసం కొంత సమయం తీసుకోవడం ఆయనకు అలవాటు. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే ధర్మశ్రీ కాస్త డిఫరెంట్‌. గుర్తింపు కోసమో.. లేక కేబినెట్‌లో బెర్త్‌ కోసమో కానీ.. ఇటీవల ధర్మశ్రీ చేపట్టిన ప్రాసల భజన.. డోస్‌ ఎక్కువైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నెగిటివ్‌ కామెంట్స్‌పై పార్టీ వర్గాల్లో చర్చ..!

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు ధర్మశ్రీ. తను రాసుకొచ్చిన స్క్రీన్‌ ప్లేలో మిగతా సభ్యులను ఇన్వాల్వ్‌ చేసేశారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. అది కాస్తా సోషల్‌ మీడియాకు ఎక్కవడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు చోడవరం ఎమ్మెల్యే. పాజిటవ్‌ కామెంట్లు ఎలా ఉన్నా.. నెగిటివ్‌ కామెంట్స్‌ ఇప్పుడు చోడవరంలో.. పార్టీ వర్గాల్లో చర్చగా మారాయి.

సమస్యలు వదిలి పదోన్నతి వెంట పడ్డారా?

చోడవరంలో సమస్యలకు కొదవలేదు. గోవాడ సహకార చక్కెర కర్మాగారం బకాయిల.. సబ్‌ప్లాన్ గిరిజన గ్రామాల ఇబ్బందులు.. దెబ్బతిన్న రహదారులు.. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎమ్మెల్యే.. రాజకీయ పదోన్నతి కోసం భజన చేస్తున్నారని విపక్షాల విమర్శ. కేబినెట్‌ ప్రక్షాళనలో ధర్మశ్రీ చోటు ఆశిస్తున్నారు. ఇందుకోసం ఆయన పార్టీ సీనియర్లతో ప్రచ్ఛన్న యుద్ధం నడుపుతున్నారు కూడా. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఫర్వాలేదు. తేడావస్తే 2024నాటికి పరిస్థితులు మారిపోతాయోమేననే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యే ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి….!!.

Related Articles

Latest Articles