తిట్లు తినకుండా రూటుమార్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ జిల్లాల్లో కోడి పందాలకు బరులను సిద్ధం చేస్తారు..! ఆ ఎమ్మెల్యే మాత్రం పెద్దపండగను దృష్టిలో పెట్టుకుని రోడ్లు మరమ్మత్తులు చేపట్టారు. అదీ సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారట. దెబ్బతిన్న రోడ్లపై ఎమ్మెల్యేకు ఒక్కసారిగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? వాటిని బాగు చేయాలనే ఆలోచన వెనక కథేంటి? ఎవరా ఎమ్మెల్యే లెట్స్‌ వాచ్‌..!

ఈసారి సంక్రాంతికి భారీగానే సొంతూళ్లకు వస్తారని అంచనా..!
దెబ్బతిన్న రోడ్లపై ‘రూటు’మార్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి..!

సంక్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాల్లో ఓ రేంజ్‌లో హడావిడి ఉంటుంది. నెల రోజుల ముందు నుంచే పందేల కోసం కోళ్లను సిద్ధం చేస్తారు. ఉపాధి, వ్యాపారం కోసం ఎక్కడెక్కికో వెళ్లిన వాళ్లు సొంతూళ్లకు వస్తారు. గోదావరి జిల్లాల్లో ఈ సందడి మరీ ఎక్కువ. కొత్త అల్లుళ్లను సంక్రాంతికి ప్రత్యేక పిలిచి మర్యాదలు చేస్తారు. అయితే కరోనా కారణంగా విదేశాల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా సొంతూళ్లకు రావడం లేదు. ప్రస్తుతం కరోనా ఉధృతి మునుపటిలా లేకపోవడంతో ఈసారి రాకపోకలు ఎక్కువగానే ఉంటాయని ఒక అంచనా. ఇక కోడి పందాల కోసమే గోదావరి జిల్లాలకు వచ్చేవాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే ఈసారి ఏపీకి వచ్చేవారికి నడుములు విరగడం ఖాయమనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న రహదారులే అందుకు కారణం.
ఈ రోడ్లపై నరకయాతన అనుభవించేవాళ్లు స్థానిక ఎమ్మెల్యేలపై మండిపడటం.. లేదా మనసులోనే తిట్టుకోవడం కామన్‌. పండగపూట వారితో తిట్టించుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే.. ప్రభుత్వం విప్‌ చిర్ల జగ్గిరెడ్డి రూటు మార్చేశారు.

పాత బిల్లులు పెండింగ్‌.. కొత్త పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు..!

తూర్పుగోదావరి జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రహదారులు ఎప్పటికి బాగుపడతాయో తెలియదు. ఈ ఏడాది మార్చి నుంచి వరసగా మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. తాజాగా ఎస్‌ఆర్‌ఆర్‌ ధరలు పెంచి టెండర్లు పిలిచినా నాలుగోసారి నిరాశే. గతనెల 5న జిల్లాలో 457 కిలోమీటర్లు మేర 78 రోడ్లను బాగు చేయడానికి 120 కోట్లతో, 159 కిలోమీటర్లు మేర 19 రహదారులు మరమ్మతులకు 80 కోట్లతో టెండర్లు పిలిచారు. వీటిలో ఒక్క పనికి కూడా టెండరు దాఖలు కాలేదు. కొన్ని టెండర్ల గడువును ఈనెల 7, 9 వరకు పెంచారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు స్పందించడం లేదు. సుమారు 200 కోట్ల రూపాయలు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో చేసిన తాత్కాలిక మరమ్మతులకు ఇటీవల తక్కువ మొత్తంలో బిల్లులు విడుదల చేశారు. అయితే గతంలో చేసిన పనులకు బిల్లులు పూర్తిగా చెల్లిస్తేనే కొత్తగా టెండర్లు వేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో సంక్రాంతికి రహదారుల మరమ్మత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పండగపూట జనాలతో తిట్టించుకోకుండా కొత్త ఎత్తుగడ..!
సొంత ఖర్చులతో కొత్తపేట పరిధిలో రహదారులకు మరమ్మతులు..!

ఈ పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. జిల్లాలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు అధ్వాన్నస్థితికి చేరుకుంది. మోకాలు లోతు గుంతలు ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం అంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇక సంక్రాంతికి వచ్చే వాళ్లంతా కోనసీమ ముఖద్వారం మీదుగా ఉన్న ఈ రహదారిపైనే వెళ్లాలి. ఇప్పటికే ఈ మార్గంలో వెళ్లేవారు ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేను తిట్టుకొని వారంటూ ఎవరూ లేరు. ఇక సంక్రాంతికి వచ్చే వారితో కూడా పండగ పూట తిట్లు తినడం ఎందుకు అనుకున్నారో ఏమో.. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్పందించారు. సొంత ఖర్చులతో రోడ్డుపై గోతులు పూడ్చే పని చేపట్టారు.

జగ్గిరెడ్డిలా రోడ్లు బాగు చేయించాలని మిగతా ఎమ్మెల్యేలపై జనాలు ఒత్తిడి..!

కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రహదారులపై గోతులు లేకుండా ప్రయాణం సాఫీగా జరగాలనే ఉద్దేశంతో మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఈ పనులు శాశ్వతమా.. తాత్కలికమా అని ఒకవైపు చర్చ జరుగుంతడగా.. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేసిన పని ఇప్పుడు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. జగ్గిరెడ్డిలా మీరు కూడా మా రోడ్డు బాగు చేయాలని ఎమ్మెల్యేలను అక్కడి ప్రజలు వేడుకుంటున్నారట. మొత్తానికి జగ్గిరెడ్డి చేసిన పని వెనక ఉద్దేశం ఏదైనా.. మిగతా ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోందట. మరి.. వారు కూడా జగ్గిరెడ్డి బాట పడతారో లేక మానకెందుకులే అని అనుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles