సీఎల్పీ, పీసీసీ వేరు కాదు.. అంతర్గత కుమ్ములాటలు లేవు..!

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు.. ప్రత్యర్థుల అవసరం లేకుండానే.. వారికివారే విమర్శలు, ఆరోపణలతో రచ్చకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అధిష్టానికి కూడా ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అంతే కాదు.. పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు సైతం చేశారు.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని వ్యాఖ్యానించారు.. ఇక, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఈ రోజు సీఎల్పీ అత్యవసర సమావేశం పెట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను కోరినట్టు తెలిపిన ఆయన.. ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. ఖమ్మంకి ఇంచార్జ్ గా ఉన్నాను.. కొత్తగూడెం ఘటనపై సమావేశంలో చర్చించాల్సి ఉందన్నారు.. అంతే కాకుండా సీఎల్పీ పక్షాన ఎమ్మెల్యేలు ఖమ్మం పర్యటన చేయాలని అనుకుంటున్నామన్న జగ్గారెడ్డి..

Read Also: ప్రధాని కోసం మృత్యుంజయ హోమాలు.. బీజేపీ పిలుపు

మరోవైపు, సీఎల్పీ వేరు, పీసీసీ వేరు కాదని.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా రావడం వల్ల దూరంగా ఉన్నారని తెలిపారు. అయితే, బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ప్రజలకు దగ్గర కాకుండా ఉండడానికి చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. ఈ రోజు నుండి సీఎల్పీ పక్షాన, కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు జగ్గారెడ్డి. కాగా, కొత్తగూడెం ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ.. సెల్ఫీ వీడియో పాల్వంచకు చెందిన రామకృష్ణ చెప్పడంతో సంచలనంగా మారడం.. పోలీసులు రాఘవను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి.

Related Articles

Latest Articles