నమస్కారం.. సంస్కారం.. ఆ ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసిందా..?

అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ మధ్య ఏపీలో రాజకీయ వైరం ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో తిరుపతి రాయల చెరువు దగ్గర ఆవిష్కృతమైన దృశ్యం.. ఆ ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టింది. చేసింది నమస్కారంమైనా.. ఇది తమ సంస్కారమని చెప్పినా.. టైమింగే తేడా కొట్టిందట. ఇంకేముందీ సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.

సోషల్‌ మీడియాలో చెవిరెడ్డి వరద సాయం వీడియోలు..!

తిరుపతి సమీపంలోని రాయల చెరువు లీకేజీ కారణంగా ఇరవైకి పైగా గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కట్టకు గండిపడి నీళ్లు బయటకు రాకుండా.. అధికారులతో కలిసి ఇసుక బస్తాలు వేయించి.. ఆ ప్రాంతంలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. హెలికాఫ్టర్‌ ద్వారా ముంపు ప్రాంతాల్లోని బాధితులకు ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. టీటీడీతో మాట్లాడి మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు.. ఎమ్మెల్యే అనుచరులే పోస్ట్‌ చేస్తున్నారో లేక పార్టీ కార్యకర్తలే అప్‌లోడ్‌ చేస్తున్నారో కానీ.. సోషల్‌ మీడియాలో బాగానే వైరల్‌ అవుతున్నాయి.

చంద్రబాబు రాగానే చెవిరెడ్డి స్పందించిన తీరుపై చర్చ..!

చెవిరెడ్డి వరద సాయానికి సంబంధించిన వీడియోలు నెల్లూరు, కడప జిల్లాల్లోని అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందట. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన శాసన సభ్యులను ఉద్దేశించి అక్కడి ప్రజలు మీరూ ఉన్నారు.. ఎందుకు? అని నిలదీస్తున్నారట. ఇదెక్కడి తలనొప్పి అని చెవిరెడ్డిని తలచుకుని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్న వేళ.. సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. అదీ రాయల చెరువు దగ్గరకు చంద్రబాబు రాక.. ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

బాబు రాగానే లేచి నిలబడి నమస్కారం చేసిన చెవిరెడ్డి..!

రాయల చెరువు దగ్గర ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉన్న సమయంలో చంద్రబాబు కాన్వాయ్‌ వచ్చింది. బాబు కారు రాగానే.. అప్పటి వరకు ఒక బండపై కూర్చున్న చెవిరెడ్డి లేచి.. విపక్ష నేతకు నమస్కారం చేశారు. ఈ సన్నివేశం అక్కడి కెమెరాలకు చిక్కింది. అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీటి పర్యంతమై.. వైసీపీపై విమర్శలు చేశారు. అదే చంద్రబాబు వస్తే.. చెవిరెడ్డి లేచి నిలబడి నమస్కారం చేయడం అధికారపార్టీలోనే చర్చకు దారితీస్తోందట. కొందరైతే ఈ వీడియోను చంద్రబాబుపై ఫైర్‌ అయ్యే మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు ట్యాగ్‌ చేశారట. ఇదీ మా రాయలసీమ సంస్కారం అని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కృష్ణా జిల్లా నాయకులు మా రాయలసీమ నేతలను చూసి గౌరవం ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలని ఇంకొందరు పోస్టింగ్‌లు పెడుతున్నారట.

చెవిరెడ్డి నమస్కారంపై వైసీపీ పెద్దలు ఆరా తీశారా?

ఈ రచ్చంతా ఒక ఎత్తైతే.. వైసీపీ పెద్దలు సైతం చెవిరెడ్డి నమస్కారంపై ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఎమ్మెల్యేను అడిగినట్టు టాక్‌. మరి.. ఈ రగడ నుంచి.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న దాడి నుంచి చెవిరెడ్డి ఎలా బయట పడతారో చూడాలి.

Related Articles

Latest Articles