హుజురాబాద్ కు కేటీఆర్.. తాడోపేడో తేల్చేస్తారా?

హుజురాబాద్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో నాయకుల హడావుడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది అక్టోబర్ 13. పోలింగ్ 30న జరుగనుండగా ఫలితం నవంబర్ 2న వెలువనుందని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు కూడా పలు పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలువనుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఇవాళో రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తుంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ నోటిఫికేషన్ కు ముందు నుంచే బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఇక్కడ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక తేది ఖరారు కావడంతో ఎన్నికల వాతావరణం హీటెక్కింది.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గాలి వీస్తుందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నికను లైట్ తీసుకుందనే ప్రచారం జరిగింది. ఇక్కడ ఓడినా, గెలిచినా టీఆర్ఎస్ కు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదన్నట్లు ఆపార్టీ నేతలు మాట్లాడారు. గతంలో మంత్రి కేటీఆర్ సైతం హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదంటూ కామెంట్ చేశారు. అయితే ఈ ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై చూపుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతోనే కేటీఆర్ కూడా ఈ ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేటీఆర్ పేరును గులాబీ నేతలు చేర్చారు.

హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతలను ఇప్పటికే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు గంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ నిత్యం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. దళిత ఓటర్లను ఆకర్షించేలా సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో దళిత కుటుంబానికి 10లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ సామాజిక వర్గ ఓట్లు టీఆర్ఎస్ కే పడుతాయని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు యాదవ సామాజిక వర్గం అండగా నిలిచే అవకాశం ఉంది. మరో రెండేళ్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండనుంది. దీంతో ప్రజలు తమకే పట్టం కడుతారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ లకు ఈ ఎన్నికలో గట్టి షాక్ ఇవ్వాలని గులాబీ నేతలు అనుకుంటున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఎన్నికను లైట్ తీసుకున్న నేతలు సైతం హుజూరాబాద్ లో ప్రచారం చేసేందుకు బయలు దేరుతున్నారు. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్ సైతం హుజూరాబాద్ లో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తాజాగా 20మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా అందజేశారు.

ఈ లిస్టులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమాలకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీష్ కుమార్, గువ్వల బాలరాజు, ఆరూరి రమేష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, కనుమళ్ల విజయ ఉన్నారు. వీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. అయితే గత ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ పేర్లు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.

-Advertisement-హుజురాబాద్ కు కేటీఆర్.. తాడోపేడో తేల్చేస్తారా?

Related Articles

Latest Articles