మరో వివాదంలో మంత్రి జయరామ్‌..!

తరచూ వివాదాల్లో చిక్కుకోవడం.. ఆనక పార్టీ పెద్దలతో తలంటించుకోవడం.. ఆ మంత్రికి కామనైపోయిందా? అప్పట్లో పేకాట.. బెంజ్‌ కారు.. ఇప్పుడు SIని బెదిరిస్తున్న వీడియో…! మళ్లీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ?

ఈ స్థాయిలో వరస వివాదాల్లో చిక్కుకున్న మరో మంత్రి లేరా?

గుమ్మనూరు జయరామ్‌. ఏపీ కార్మిక శాఖ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరామ్‌.. మంత్రి అయ్యాక కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. ఏపీ కేబినెట్‌లో వరస వివాదాల్లో చిక్కుకున్న మంత్రి మరొకరు లేరనే చర్చ మొదలైంది. ఇప్పుడు వైరల్‌ అవుతున్న బెదిరింపు వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చారు జయరామ్‌. అంతేకాదు.. తాడేపల్లిలో పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోక తప్పదనే ప్రచారం జరుగుతోంది

పేకాట క్లబ్‌ నిర్వహణలో ఆరోపణలు
ఈఎస్‌ఐ స్కామ్‌లో బెంజ్‌ కారు నజరానా?

అప్పట్లో పేకాట క్లబ్‌ నిర్వహణ విషయంలో మంత్రి జయరామ్‌ పేరు మార్మోగింది. మంత్రి బంధువులపైనే పోలీసులు కేసు పెట్టారు. పైగా పేకాట స్థావరాలపై దాడులకు వచ్చిన పోలీసులపై మంత్రి అనుచరులు ఎదురుతిరగడం సంచలనంగా మారింది. ESI స్కామ్‌లో ఓ నిందితుడి నుంచి బెంజ్‌ కారును నజరానాగా పొందారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై పార్టీ పెద్దలకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఆ సమయంలో మంత్రిగారికి గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారని ప్రచారం జరిగింది.

ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్‌ఐని బెదిరించిన మంత్రి!

తాజాగా కొత్త వైరల్ వీడియోతో హెడ్‌లైన్స్‌కు కంటెంట్ అయ్యారు మంత్రి జయరామ్‌. నియోజకవర్గంలో తమవర్గం వారిని నాయకులు వెనకేసుకుని రావటం కామన్‌. కానీ.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాని SIని బెదిరించారు మంత్రి. లేకపోతే మంత్రి అని కూడా చూడకుండా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌ అయింది. ఒక మంత్రి ఈ తరహాలో అవినీతి పరులకు వత్తసు పలకడం.. SIని బెదిరించడం చర్చగా మారింది.

ఆలూరులో ఇసుక రీచ్‌లే లేవన్నది మంత్రి వాదన!

మంత్రి జయరామ్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్‌ పెట్టారు. ఏమైందో ఏమో ఆలూరు ఉన్న మంత్రి అమరావతిలో కనిపించారు. ఇక్కడే పార్టీ వర్గాల్లో జోకులు పేలుతున్నాయి. సమీక్షలు, సమావేశాల కంటే.. మంత్రిగారు వివరణలు ఇచ్చుకోవడానికి వస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయని తాడేపల్లి సర్కిళ్లలో సెటైర్లు వినిపిస్తున్నాయి. మంత్రి మాత్రం.. ఆలూరులో ఇసుక రీచ్‌లు లేవని వాదిస్తున్నారు. రీచ్‌లే లేనప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలకు ఆస్కారమే లేదన్నది ఆయన వివరణ. ఖాళీ ట్రాక్టర్లను పట్టుకుని రైతులను పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ప్రజాప్రతినిధిగా స్పందించానని మంత్రి జయరామ్‌ చెబుతున్నారు. అయితే ఒకసారి బెదిరింపు వీడియో వైరల్‌ అయ్యాక ఎన్ని వివరణలు ఇచ్చినా.. చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టే అవుతుందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మరి.. మంత్రిగారి వివరణ ఇస్తే దానిపై తాడేపల్లి వర్గాల రియాక్షన్‌ ఏంటో చూడాలి.


Related Articles

Latest Articles

-Advertisement-