విజయ్ దేవరకొండ మా ఫ్యామిలీ మెంబర్: మంత్రి ఎర్రబెల్లి

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. అతడు వరంగల్ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తాడని ఎర్రబెల్లి వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చాడని, ఈరోజు కూడా వచ్చాడని ఎర్రబెల్లి తెలిపారు. హీరో ఆకాష్ పూరీ ఈ మూవీతో సక్సెస్ అవుతాడని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

అటు పూరీజగన్నాథ్ సినిమాలు బాగా తీస్తాడని.. అతడు ఏ సినిమా తీసినా వరంగల్ నుంచే ప్రారంభించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ తర్వాత వరంగల్ ఛాయిస్ అవ్వాలని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. వరంగల్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందని.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఎర్రబెల్లి అన్నారు. వరంగల్ నగరం గతంలో లాగా లేదని.. కాకతీయుల కాలం నాటి శిథిలావస్థలో ఉన్న కట్టడాలను తాము బాగుచేస్తున్నామని, సినిమా వాళ్లందరూ వరంగల్‌లో తప్పకుండా సినిమా షూటింగులు జరుపుకోవాలని ఎర్రబెల్లి కోరారు. రామప్ప టెంపుల్, లక్నవరం చెరువు, వేయి స్తంభాల గుడి ఇలా చాలా అందమైన ప్రదేశాలు వరంగల్‌లో ఉన్నాయన్నారు.

Related Articles

Latest Articles