ఏపీలో వైఎస్‌ షర్మిల పార్టీ..? మేమంతా ఒక్కటే అంటున్న ఏపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడతారా? అంటూ ఎదురైన ప్రశ్నపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించిన తీరు.. ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్‌ ఉందా? అంటూ ఎదురుప్రశ్నించిన కాకరేపారు వైఎస్‌ షర్మిల.. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు.. కానీ, ఏపీలో పార్టీ పెడతామని చెప్పలేదన్నారు.. వైఎస్‌ షర్మిల.. ఏపీలో పార్టీ పెడతారని అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. షర్మిలమ్మ మేం అంతా వైయస్సార్ కుటుంబం.. మేమంతా ఒక్కటేనని స్పష్టం చేశారు.

Read Also: కేసీఆర్‌ నిజంగా అవినీతి చేస్తే బయటపెట్టరే..! ఇదో డ్రామానా..?

ఇక, చంద్రబాబు చేసిన విద్యుత్ బకాయిలు కూడా ఇప్పుడు తీరుస్తున్నాం అన్నారు మంత్రి బాలినేని.. చంద్రబాబు పోలవరంలో ఏమి చేసారో అందరికీ తెలుసన్న ఆయన.. రాజధానికి ఆయన చేసిందేమీ లేదు.. అందుకే ఓడి పోయారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబులా సీఎం వైఎస్‌ జగన్ ఎవరిని యాచించే వ్యక్తి కాదన్న బాలినేని.. రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అంటూ బాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చుట్టూ తిరిగాడు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టామని ఎన్టీఆర్ చెబితే అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. జగన్, కాంగ్రెస్ తో కలిస్తే కేసులు మాఫీ చేసేవారు.. కేంద్రంలో ఉన్న సోనియాను కూడా జగన్ ఎదిరించి పార్టీ పెట్టారని.. చంద్రబాబుపై ఏమైనా కేసులు పెడితే ఏదోలా స్టే తెచ్చుకుంటారు.. సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే కేసుల మాఫీ కోసం వెళ్లారంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 29 సార్లు ప్రధానిని ఎందుకు కలిశారు? అని నిలదీసిన మంత్రి బాలినేని.. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయింది.. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మూడు లక్షల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చారా..? అంటూ మండిపడ్డారు.

Related Articles

Latest Articles